జైనూరు ఘటనను సుమోటో కేసుగా స్వీకరించిన జాతీయ మానవ హక్కుల కమిషన్

ఆసిఫాబాద్ కొమరంభీం జిల్లా జైనూర్ మండలలో ఆదివాసీ మహిళపై లైంగిక దాడి కేసును జాతీయ మానవ హక్కుల కమిషన్ సుమోటోగా స్వీకరించింది. సుమోటోగా పరిగణించి కేసు కూడా నమోదు చేసింది. అంతేకాకుండా ఈ విషయంలో కమిషన్ సీరియస్ అయ్యింది. ఇందుకు సంబంధించి పూర్తి స్థాయి వివరాలతో తక్షణమే వాస్తవ నివేదికను సమర్పించాలని తెలంగాణ డీజీపీ, ప్రభుత్వ కార్యదర్శిని కమిషన్ ఆదేశించింది.
అసలు ఇంతటి హింసకు కారణమేంటంటే.. ఆగస్టు 31 న జైనూరు మండలం దేవుగూడ శివారులో ఓ ఆదివాసీ మహిళను ఆటో డ్రైవర్ షేక్ మగ్దూం.. తన ఆటో ఎక్కించుకున్నాడు. రాఘాపూర్ దాటగానే.. ఒంటరిగా ఉన్న ఆ మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు. దీంతో ఆమె కేకలు వేయడంతో.. ఓ ఇనుప రాడ్డుతో ఆమె ముఖంపై తీవ్రంగా గాయపర్చాడు. దీంతో ఆమె స్పృహ తప్పి పడిపోవడంతో.. ఆమెను రోడ్డుపై పడేసి డ్రైవర్ షేక్ మగ్దూం పారిపోయాడు.
అయితే రక్తపు మడుగులో పడి ఉన్న మహిళను గమనించిన స్థానికులు.. 108లో జైనూర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స తర్వాత ఆదిలాబాద్‌ రిమ్స్‌కు, అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. మరోవైపు గుర్తుతెలియని వాహనం ఢీకొట్టిందని.. బాధితురాలి సోదరుడు ఈ నెల 1న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్న బాధితురాలు స్పృహలోకి రావడంతో.. అసలు విషయం వెలుగులోకొచ్చింది. తనపై ఆటో డ్రైవర్‌ షేక్‌ మగ్దూం లైంగిక దాడితో పాటు.. రాడ్డుతో కొట్టిన విషయాలను పోలీసులకు తెలియజేసింది. దీంతో నిందితుడిపై లైంగికదాడి, హత్యాయత్నంతో పాటు.. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *