జైషే మహ్మద్ ఉగ్రవాది అబ్దుల్ అజీజ్ అనుమానాస్పద మృతి
భారత దేశ శత్రువు, ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ టాప్ కమాండర్ మౌలానా అబ్దుల్ అజీజ్ ఇసార్ హతమయ్యాడు. పాకిస్తాన్ లోని పంజాబ్ జిల్లాలో అనుమానాస్పదంగా మరణించాడు. ఈ విషయాన్ని పలు అంతర్జాతీయ మీడియా సంస్థలు ప్రకటించాయి. జైషే వర్గాల సమాచారం ప్రకారం, జూన్ 2న ఇసార్ మరణించాడని, అతని మృతదేహాన్ని మంగళవారం తెల్లవారుజామున గుర్తించారని తెలుస్తోంది.అయితే అతడి శరీరంపై బుల్లెట్ గాయాలు ఉండగా.. జైషే మహ్మద్ ఉగ్రసంస్థ వర్గాలు మాత్రం గుండెపోటుతో చనిపోయినట్లు చెబుతున్నాయి.
ఇసార్ భారత వ్యతిరేక కార్యకలాపాల్లో, ఉగ్రవాద దాడుల ప్రణాళికల్లో కీలకంగా వున్నాడు. జైషే మహ్మద్ ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ వ్యూహకర్తల్లో ఒకడుగా చెబుతుంటారు. 2016 నగ్రోటా దాడితో సహా భారత్ లో జరిగిన అనేక ఉగ్రవాద కుట్రల వెనుక వున్నాడన్న ఆరోపణలు బలంగా వున్నాయి. భారత వ్యతిరేక భావాలను రెచ్చగొట్టడంలో ముందుంటాడని, భారత్ వ్యతిరేక ప్రసంగాలు చేయడంలో ముందుంటాడని అంటారు.
పాకిస్తాన్‌లో గత కొన్ని నెలలుగా కీలక ఉగ్రసంస్థలకు చెందిన అగ్రనేతలు, కీలక నేతలు వరుసగా హత్యలు, అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. తాజాగా జైషే మహ్మద్ ఉగ్రసంస్థకు చెందిన సీనియర్ ఉగ్రవాది మౌలానా అబ్దుల్ అజీజ్ పాకిస్తాన్‌లో బహవల్పూర్‌లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం గమనార్హం. ఇటీవల ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా భారత్ బహవల్పూర్‌లోని జైషే మహ్మద్ ఉగ్రకార్యాలయంపై దాడి చేయగా.. ఆ దాడి నుంచి అబ్దుల్ అజీజ్ తప్పించుకున్నట్లు తెలుస్తోంది.