తల్లిని భుజాలపై మోసుకుంటూ వచ్చి.. త్రివేణి సంగమ స్నానం
ప్రయాగ్ రాజ్ : మహా శివరాత్రి సందర్భంగా త్రివేణి సంగమంలో అద్భుతమైన దృశ్యం ఆవిష్కృతమైంది. రామ్ భజన్ యాదవ్ అనే వ్యక్తి తన 100 ఏళ్ల తల్లిని తన భుజాలపై మోసుకెళ్లి సంగమంలో స్నానం చేయించాడు. ఇది అందర్నీ విశేషంగా ఆకర్షించింది. రామ్ భజన్ యాదవ్ మధ్యప్రదేశ్‌లోని ఉమారియా జిల్లా నుండి వచ్చారు. అతని తల్లి చాలా వృద్ధురాలు, ఆమె నడవడం కష్టం. దీంతో ఆయన తన తల్లిని భుజాలపై ఎత్తుకొని, కొన్ని కిలోమీటర్లు నడుస్తూ, త్రివేణి సంగమం చేరుకున్నాడు. తన తల్లి కోరిక మేరకు తీసుకొచ్చాడు. ఆయన తల్లి పట్ల చూపిన సేవా స్ఫూర్తి, భక్తిని చూసి భక్తులు భావోద్వేగానికి గురై, పూలమాలలు వేసి సత్కరించారు.