తహవూర్ రాణా అప్పగింప భారత దౌత్య విజయమే : అమిత్ షా
ముంబై పేలుళ్ల కేసులో నిందితుడు తహవూర్ రాణా నేడు భారత్ కి రానున్న విషయం తెలిసిందే. అయితే దీనిపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పందించారు. అతడి అప్పగింత అన్న విషయం భారత్ కి అతిపెద్ద దౌత్య విజయంగా పేర్కొన్నారు. భారత్ కి, ఇక్కడి ప్రజలకు హాని కలిగించే వ్యక్తులను ప్రధాని మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం విడిచిపెట్టదని ప్రకటించారు. బాంబు పేలుళ్లు ఎవరి హయాంలో జరిగాయో వారు అతడ్ని వెనక్కి తీసుకురాలేకపోయారని, కానీ.. తాము తిరిగి తీసుకొస్తున్నామని ప్రకటించారు. తహవూర్ రాక భారత్ కు అతిపెద్ద దౌత్య విజయమని అన్నారు. ఇది మోదీ ప్రభుత్వ దౌత్య నైపుణ్యాన్ని, న్యాయంపై వున్న నిబద్ధతను తెలియజేస్తోందని పేర్కొన్నారు. దేశానికి వ్యతిరేకంగా దాడులు చేసే వారిని మోదీ ప్రభుత్వం వెంటాడుతూనే వుంటుందని ప్రకటించారు.
ముంబై పేలుళ్ల కేసులో నిందితుడు తహవూర్ రాణాను అమెరికా అధికారులకు భారత్‌కి అప్పగించేశారు. ప్రస్తుతం రాణాను తీసుకొని, భారతీయ అధికారుల బృందం భారత్‌కు పయనమైనట్లు తెలుస్తోంది. ఈ విషయాలు అంతర్జాతీయ ఆంగ్ల పత్రికలు పేర్కొన్నాయి. బుధవారం రాత్రికల్లా లేదా గురువారం ఉదయం కల్లా అతనితో మన అధికారులో భారత్‌కి చేరుకోనున్నారు.
తహవూర్ రాణాకు అమెరికాలో వుండేందుకు వున్న చట్టపరమైన అవకాశాలన్నీ ముగిశాయి. దీంతో అతడ్ని ఇండియాకి అప్పగించేందుకు నిర్ణయం తీసుకున్నారు. అయితే తనను భారత్‌కి అప్పగించవద్దంటూ రాణా అమెరికాలోని సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశాడు. దీనిపై అక్కడి న్యాయస్థానం విచారించింది. విచారణ తర్వాత రాణా పిటిషన్‌ని కొట్టిపారేసింది. తహవూర్ రాణా అభ్యర్థనను కొట్టేస్తున్నామని అమెరికా సుప్రీం కోర్టు సోమవారం ప్రకటించింది. దీంతో రాణా అప్పగింతకు లైన్ క్లియర్ అయ్యింది.