తెలంగాణలో ‘పశురక్తమార్పిడి’’ కేంద్రం ప్రారంభం
కేవలం మనుషులకే రక్తమార్పిడి కాదు… ఇప్పుడు పశువులకు కూడా రక్తమార్పిడి పద్ధతి అందుబాటులోకి వచ్చింది. తెలంగాణలో మొదటిసారిగా ఇది అందుబాటులోకి వచ్చింది. రాజేంద్ర నగర్ పశువైద్యశాలలోని వెటర్నరీ క్లినికల్ కాంప్లెక్స్ లో పశురక్తమార్పిడి కేంద్రాన్ని విశ్వవిద్యాలయ వీసీ సవ్యసాచీ ఘోష్ ప్రారంభించారు. పశువులు గాయపడినప్పుడు, వివిధ జబ్బులతో బాధపడుతున్నప్పుడు రక్తమార్పిడి అత్యవసరమవుతోందన్నారు. ఈ సమస్యపై పీవీ నరసింహారావు పశువైద్య విశ్వవిద్యాలయ వీసీ అధికారులు, శాస్త్రవేత్తలు చర్చించి అవసరమైన ప్రతిపాదనలు తయారు చేశారు. ఈ పశురక్త మార్పిడి కేంద్రానికి యాక్సిస్ బ్యాంకు 18 లక్షల సాయం అందించింది. దేశంలోని కొద్ది రాష్ట్రాల్లోనే ఈ పశురక్త మార్పిడి కేంద్రాలున్నాయని, ఇప్పుడు తెలంగాణలో కూడా ఏర్పాటైందన్నారు. ప్రతి రోజు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకూ ఉచిత సేవలందిస్తామని వీసీ ప్రకటించారు.