తెలంగాణ యువ రైతుకి జాతీయ పురస్కారం… సేంద్రీయ వ్యవసాయంలో కొత్త పద్ధతులతో గుర్తింపు
తెలంగాణ యువరైతు మావురం మల్లికార్జున్ రెడ్డికి జాతీయ పురస్కారం లభించింది. ఈయనది కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం పెద్దకుర్మపల్లి. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చి ఆధ్వర్యంలో ఏటా దేశ వ్యాప్తంగా ఉత్తమ రైతులను ఎంపిక చేసి, ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఫెలో ఫార్మర్, ఇన్నోవేటివ్ ఫార్మర్ విభాగాల్లో పురస్కారాలు అందిస్తుంది.ఈ యేడాది ఫెలో ఫార్మర్ పురస్కార విభాగంలో ఆరుగురు రైతులను ఎంపిక చేశారు. అందులో దక్షిణ భారతం నుంచి మల్లికార్జున్ రెడ్డి మాత్రమే వున్నారు. సేంద్రీయ, సమీకృత వ్యవసాయం చేస్తున్నాడు. అలాగే మిగతా రైతులకు కూడా అవగాహన కల్పిస్తున్నాడు.
ఇక, మల్లికార్జున్ రెడ్డి రసాయనాలు లేకుండా పంటలు పండించడంతోపాటు , జీవామృతం ద్వారా పలు రకాల పంటలను తనకున్న 17 ఎకరాల్లో పండిస్తూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు.నిజానికి కొన్ని సంవత్సరాల క్రితం మల్లికార్జున్ రెడ్డి బంధువు కేన్సర్ తో మరణించాడు. వారి కుటుంబంలో ఎవ్వరికీ కేన్సర్ చరిత్రే లేదు. కలుషితమైన ఆహారం తీసుకోవడం వల్లే కేన్సర్ వచ్చిందని రిపోర్టుల ద్వారా తెలుసుకున్నాడు. రసాయనాలు, పురుగు మందులతో కూడిన ఆహారం చాలా ప్రభావితం చేస్తోందని తెలుసుకున్నాడు. ఈ ఘటనతో చాలా ప్రభావితమయ్యాడు.
రసాయనాలు, పురుగుల మందులు లేని ఆహారాన్ని పండించాలని మల్లికార్జున్ రెడ్డి నిర్ణయించుకున్నాడు. ఇలాంటి ఆహారాన్ని పండించాలని భావించాడు. దీంతో హైదరాబాద్ లో చేస్తున్న ఉద్యోగాన్ని మానేసి, 13 ఎకరాల్లో సేంద్రీయ సాగు చేయాలని నిర్ణయించాడు. తన భార్య సంధ్య కూడా ఓకే చెప్పింది. దీంతో సేంద్రీయ వ్యవసాయ పద్ధతిలో 26 రకాల వరి, కూరగాయలు, ఔషద మొక్కలను పెంచుతున్నారు. ఇది ఇండియన్ కౌన్సిలర్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ICAR) దృష్టిలో పడింది. దీంతో అవార్డు లభించింది. ICAR అవార్డు లభించిన రాష్ట్రంలో మొదటి వ్యక్తి మల్లికార్జునే.
అలాగే మరో 8 అవార్డులను కూడా గెలుచుకున్నాడు. వినూత్న పద్ధతుల ద్వారా సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నాడు. సంవత్సరానికి 16 లక్షల ఆదాయం వస్తోంది.తమ పిల్లలకు సురక్షితమైన ఆహారం, ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించాలన్నదే తమ తపన అని అన్నారు.
మొదలు కొద్దిపాటి భూమిలో సేంద్రీయ వ్యవసాయం చేయడం ప్రారంభించానని, క్రమంగా సాగును పొడిగించినట్లు తెలిపారు. వరి, అల్లం, నువ్వులు, వేరుశెనగ, వాసక ఆకులతో పాటు ఇతర ఔషద మొక్కలను కూడా సేంద్రీయ పద్ధతిలో సాగు చేస్తున్నాడు. ఒక సీజన్ లో ఎకరానికి 42 క్వింటాళ్ల వరిని పండిస్తున్నాడు. గతంలో కంటే 12 శాతం ఎక్కువ దిగుబడి వస్తోంది.
వర్షపు నీటిని సంరక్షణ పద్ధతిలో మేలు సాగు
డ్రిప్ ఇరిగేషన్ తో పాటు భూగర్భ జలాలను మరింత పెంచుకుంటున్నాడు. అతని వ్యవసాయ నేల నిత్యం తేమతో వుంచడానికి వర్షపు నీటిని సంరక్షించే పద్ధతిని అవలంబిస్తున్నాడు. వర్షపు నీటిని నిల్వచేయడానికి చిన్నపాటి చెరువును కూడా చేసుకున్నాడు. దీని ద్వారా చెరువులో 600 చేపలను పెంచుతూ ఆక్వా కల్చర్ కూడా చేస్తున్నాడు.
ఇక.. తాను పెంచుతున్న గొర్రెలు, మేకలు, కోళ్ల పెంపకం ద్వారా వాటి వ్యర్థాలతో పంటలకు సహజ పోషకాలను కూడా అందిస్తున్నాడు. జీవామృతం, వేప వంటి సేంద్రీయ ఎరువులతో నేల సారాన్ని పెంచుకుంటున్నాడు. రైతు కూలీలను కూడా తక్కువ సంఖ్యలోనే ఉపయోగిస్తున్నట్లు చెప్పాడు. తనకు ఐటీ కంపెనీలో వచ్చే సంపాదన కంటే అధిక సంపాదన వస్తోందని ప్రకటించాడు.
ఇక… ఈ వినూత్న పద్ధతులు, సేంద్రీయ వ్యవసాయ పద్ధతులను తాను ఆచరిస్తూ… ఇతర రైతులకు కూడా ఆలోచనలు పంచుతున్నాడు. దీంతో కృషి విజ్ఞాన కేంద్రం (కెవికె) సలహా కమిటీ సభ్యుడిగా బాధ్యతలు కూడా తీసుకున్నాడు. అలాగే జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్శిటీలో ఫ్యాకల్టీ మరియు వివిధ రైతు సమూహాలలో సభ్యుడు కూడా.