దుండగులను శిక్షించాలని శంషాబాద్ లో హిందువుల ర్యాలీ

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కాలనీ హనుమాన్ దేవాలయంలోని నవగ్రహ విగ్రహాలను ధ్వంసం చేసిన ఘటనపై హిందువులు భారీ నిరసన చేపట్టారు. బాధ్యులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ హిందూ సంస్థలు, స్థానిక ప్రజలు, భక్తులు నిరసనకు దిగారు. శంషాబాద్ బస్టాండ్ నుంచి డీసీపీ కార్యాలయం వరకూ ఈ ర్యాలీ సాగింది. ఇందులో విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్, బీజేపీతో సహా భక్త సంఘాలు, సమాజంలోని అన్ని వర్గాలూ పాల్గొన్నాయి. దేవాలయంపై జరిగిన దాడిని ఖండించారు. దేవాలయ విధ్వంసానికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయని, అయినా కాంగ్రెస్ ప్రభుత్వం ఏమీ మాట్లాడటం లేదని, చర్యలు కూడా శూన్యమని మండిపడ్డారు.

 

దేవాలయాల రక్షణకు కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని నిరసనకారులు డిమాండ్ చేశారు.అయితే ఈ ర్యాలీని అడ్డుకోవడానికి పోలీసులు ప్రయత్నించారు. దీంతో పోలీసులపై నిరసనకారులు తీవ్రంగా మండిపడుతూ… ఎందుకు ఆపాలని ప్రయత్నిస్తున్నారని ప్రశ్నించారు. దీంతో కాస్త ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. దాడి చేసిన వ్యక్తులను వదిలేసి, కేవలం హిందువులనే టార్గెట్ చేస్తున్నారని, తీవ్రమైన అన్యాయం చేస్తున్నారని హిందువులు ఆక్రోషించారు.

ఈ ఘటనపై విశ్వహిందూ పరిషత్ జాతీయ అధికార ప్రతినిధి రావినూతల శశిధర్ తీవ్రంగా స్పందించారు. ఇస్లామిక్ ఛాందసులు హిందూ దేవాలయాలపై టార్గెట్ విధ్వంసాలకు పాల్పడుతున్నారని, దీనిపై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులను నిరోధించడంలో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. పోలీసులు ఈ ఘటనను పిచ్చోడి చర్యగా కొట్టిపారేసే అవకాశాలున్నాయని అనుమానాలు వ్యక్త చేశారు. ఇస్లామిక్ ఛాందసులపై చర్యలు తీసుకోవాలని గట్టిగా డిమాండ్ చేశారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *