దుకాణాల్లో మనుషులే వుండరు… నిజాయితీయే అక్కడ పనిచేస్తోంది
దుకాణం అనగానే దానికో యజమాని… సీసీ టీవీలు, డబ్బులు వేసుకొనే డబ్బాలు… ఇవన్నీ గుర్తొస్తాయి కదా.. కానీ మిజోరాంలోని సెలింగ్ అనే గ్రామంలో మాత్రం ఇందుకు భిన్నం. దుకాణాల్లో మనుషులెవ్వరూ వుండరు. మనకు నచ్చిన వాటిని తీసుకొని, అక్కడే వుండే కౌంటర్లో డబ్బులు వేసి వెళ్లిపోవాలి. దుకాణాల్లో ఏయే వస్తువులు దొరుకుతాయో.. బయట బోర్డు పెడతారు. వాటిని తీసుకోవాలి. అయితే.. దుకాణుదారు ఎక్కడి వెళ్తాడంటే.. దుకాణాన్ని తెరిచి, తమ తమ పనులకు వెళ్లిపోతారు. కొందరు కూలి పనులకు వెళితే, మరికొందరు తమ తమ పనుల్లోకి వెళ్లిపోతారు. కానీ దుకాణం మాత్రం సవ్యంగానే సాగుతుంది. అక్కడ నమ్మకమే పునాది.
ప్రస్తుత యుగంలో ఎటు చూసినా సీసీ టీవీలే. అపనమ్మకమైన చూపులు. ఎదుటి వార్ని నమ్మడం వుండదు. కానీ… దీనంతటికీ విరుద్ధంగా సీసీ టీవీలు లేవు, మనుషులూ లేరు.. కానీ దుకాణం మాత్రం సవ్యంగానే నడుస్తుంది. ఇక్కడ నమ్మకమే డబ్బు.
కాలానుగుణంగా దొరికే పండ్లు, కూరగాయలు, పచ్చళ్లు, జ్యూస్… ఇలా అన్నీ దొరుకుతాయి. దీనికి కొద్ది దూరంలో వ్యవసాయ పొలాలుంటాయి. అందులో మహిళా రైతులే వుంటారు. వీరు పండించిన వాటినే ఈ దుకాణంలో అమ్ముతారు. ఇలా చుట్టు పక్కలా వుండే 20 దుకాణాలకు వీరు కావాల్సిన వస్తువులను సరఫరా చేస్తుంటారు. వీరు ఉదయం లేదా రాత్రి.. వస్తువులను దుకాణాల్లో నింపేసి, వెళ్లిపోతారు. మళ్లీ పొలాల నుంచి ఇంటికి వెళ్లే సమయంలో బాక్సుల్లో వుండే నగదును తీసుకుంటారు.ఇలాగే మిజోరంలో కూడా కొన్ని దుకాణాలు వున్నాయి. అవీ ఇలాగే నడుస్తున్నాయి.కేరళ పాఠశాలల్లోనూ ఇలా వున్నాయి.
దేవుడు సర్వాంతర్యామి… ఆయన మాత్రం చూస్తాడు…
పుట్ సెరో లో దుకాణం నడిపిస్తున్న అంగా వెఖోటాలు అనే వ్యక్తి దీనిపై మాట్లాడాడు. 15 సంవత్సరాలుగా తాను రెండు దుకాణాలు ఇలాగే నడిపిస్తున్నానని చెప్పుకొచ్చాడు. గత రెండు మూడేళ్లలో ఇలాంటి షాపుల సంఖ్యా పెరిగిందని తెలిపాడు. పర్యాటకులు కూడా ఇక్కడి ప్రకారమే నడుచుకుంటారని పేర్కొన్నాడు. అయితే ఇక్కడ అమ్మేవి అంతా సేంద్రీయ వ్యవసాయం ద్వారా పండించిన వాటినే అమ్ముతారని కూడా పేర్కొన్నాడు. గ్రామీణ మహిళలు ఇలాంటి దుకాణాలను నడుపుతారని, రోజుకు 2,000 రూపాయలు సంపాదిస్తున్నారు.
అయితే… ఇంత నమ్మకంగా ప్రజలు డబ్బులను డబ్బాల్లో వేసి వెళ్లిపోతారన్న నమ్మకం మీకెలా కుదిరిందని ప్రశ్నించగా… అలాంటి సంఘటనలు జరగవి అన్నారు. అయినా దేవుడు సర్వాంతర్యామి… ఎప్పుడూ చూస్తూనే వుంటాడు… ఎవ్వరు చూడకున్నా.. దేవుడు చూస్తున్నాడన్న నమ్మకమే ఇలా చేయిస్తోందని ప్రకటించాడు.
ఇక నాగాలాండ్ లో కూడా ఇలాంటివే పుస్తక దుకాణాలు వుంటాయట. పర్వతాల పైన వుండే కేఫ్ లలో పుస్తకాలు కూడా అమ్ముతారు. నచ్చిన వాటిని కొనుగోలు చేసి, అక్కడే వుండే డబ్బాల్లో డబ్బులు వేసి వెళ్లిపోతారు.
కరోనా మార్చింది అందరినీ..
ఈ ఊరి వారు పాటిస్తున్న ఈ పద్దతి గతంలో ఎప్పుడూ ఇక్కడ లేదు. కానీ కరోనా కాలం ఒక్కసారిగా వీళ్లందరి జీవితాలను మార్చేసింది. రైతులంతా లాక్ డౌన్ సమయంలో విపరీతమైన నష్టాలను చూశారు. దీంతో వారు పండించిన వాటిని ఇలా షాపుల్లో ఉంచేసి పనికి వెళ్లడం అలవాటు చేసుకున్నారు. కేవలం మనుషులపై ఉండే నమ్మకం, ఒకరినొకరు మోసం చేసుకోని మానవత్వమే వీరిని ఇలాంటి పనికి పూనుకునేలా చేసింది. అయితే, ఊరిలోకి ఎవరైనా కొత్తవారు వస్తే వారికి తమ గ్రామం పరిస్థితిని అర్థమయ్యేలా ఒక బోర్డు మీద రాసి పెడతారట. వారు కూడా గ్రామస్థులకు సహకరిస్తుంటారని ఇక్కడి వారు చెప్తారు.
దొంగతనాలే జరగని గ్రామం..
వారే ఎవరికి ఎవరూ కాని ఈ రోజుల్లో ఒక గ్రామమంతా కలిసి ఇలా నిజాయితీతో మెలగడం ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇక ఆ రోజంతా కౌంటర్ లో జమైన మొత్తాన్ని యజమానులు సాయంత్రానికి వచ్చి కలెక్ట్ చేసుకుంటారట. నిజంగా ఇది ఆదర్శ గ్రామమే అని దీని గురించి తెలిసిన వారంతా అనుకుంటున్నారు. అయితే, ఇప్పటి వరకు ఇక్కడ ఒక్క దొంగతనం కూడా నమోదు కాకపోవడం మరో ఆశ్చర్యంగా చెప్పుకోవచ్చు.