దేశం కోసం దక్షిణ
కాశీలో హిందూ విశ్వ విద్యాలయం కోసం మదన మోహన మాలవ్యా అందరి దగ్గర నిధి యాచించేవారు. ఒకసారి ప్రఖ్యాత కోటీశ్వరుడైన బిర్లా కాశీ వచ్చి గంగానదిలో పితృదేవతలకు తర్పణాలు సమర్పించాలనుకున్నాడు. అప్పుడు మాలవ్యాజీ స్వయంగా తానే ముందుకు వచ్చి మొత్తం కర్మకాండ యధావిధిగా నిర్వహించి చివర దక్షిణ కోసం చేయి చాపారు. బిర్లా పది రూపాయలు ఇవ్వ బోయాడు. కానీ మాలవ్యా అది తీసుకునేందుకు తిరస్కరించారు. బిర్లా వందరూపాయలు ఇవ్వబోతే ‘‘నేను స్వప్రయోజనం కోసం డబ్బు అడగడం లేదు. మహా విద్యాలయ నిర్మాణ కార్యక్రమంలో ఉన్నాను. అందుకు తగిన ఆర్ధిక సహాయం కావాలి’’ అని అన్నారు. అప్పుడు బిర్లా లక్ష రూపాయలు ఇస్తానన్నాడు. అది కూడా తిరస్కరించారు మాలవ్యా. కర్మకాండ చేయించిన పురోహితుడిని సంతృప్త పరచకపోతే కర్మ వృధావుతుంది. దానితో మాలవ్యాజీ కోరిక మేరకు ఒక కళాశాల, వసతి గృహం కట్టిస్తానన్నాడు బిర్లా. అవే బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో కనిపించే సంస్కృత మహా విద్యాలయం, బిర్లా హాస్టల్.