దేశభక్తి, నిస్వార్థ సేవ అన్న స్ఫూర్తి కందకుర్తి కేంద్రంగా పొందాలి: భాగవత్
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ వ్యవస్థాపకులు డాక్టర్ హెడ్గేవార్ పూర్వీకుల స్వగ్రామమైన నిజామాబాద్ జిల్లా కందకుర్తిలో నూతనంగా నిర్మించిన శ్రీ కేశవ స్ఫూర్తి మందిరాన్ని శనివారం రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర సంఘచాలక్ డాక్టర్ మెహన్ భాగవత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆ స్ఫూర్తి కేంద్రంలో ఏర్పాటు చేసిన గ్యాలరీని మోహన్ భాగవత్ వీక్షించారు. అదేవిధంగా డాక్టర్జీ జీవిత చరిత్రకు సంబంధించిన చిత్రమాలికను (ఆర్ట్ గ్యాలరీ) ని కూడా మోహన్ భాగవత్ వీక్షించారు. ఈ ఆర్ట్ గ్యాలరీలో డాక్టర్జీ జీవిత చరిత్రను క్షుణ్ణంగా వుంచారు.

అలాగే కేశవమూర్తి, రుక్మిణీ సమేత విఠలేశ్వర ఆలయంతో పాటు స్కంధ ఆలయాలను కూడా ఆయన సందర్శించారు. దీని తర్వాత అక్కడ ఏర్పాటు చేసిన పుస్తకంలో తమ మనోభావాలను రాతపూర్వకంగా వెల్లడించారు.

ఇక.. కేశవ స్ఫూర్తి మందిరాన్ని నిర్మించడంలో, ఇతరత్రా సహాయపడిన వారిని సర సంఘచాలక్ మోహన్ భాగవత్ చేతుల మీదుగా సన్మానాలు చేశారు. ఇందులో భాగంగా స్ట్రక్చరల్ ఇంజినీర్ ముద్రయ్య, రామకృష్ణయ్య, ఆర్కరిటెక్ట్ త్రిపురాంత రెడ్డి, సైట్ ఇంజినీర్ సూచిత్, స్థపతి పాండ్యన్, ఆర్టిస్ట్ సాయి, భవన నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన నరసింహ, భవన నిర్మాణంలో మేస్త్రీగా సేవలించిన రమణ మూర్తిని సన్మానించారు.
ఈ సందర్భంగా మోహన్ భాగవత్ మాట్లాడుతూ డాక్టర్జీ నాగపూర్ లో జన్మించారని, అక్కడి నుంచే స్ఫూర్తిమంతమైన కార్యక్రమాన్ని ప్రారంభించారని గుర్తు చేశారు. అలాగే మొట్టమొదటి కార్యకర్తను కూడా డాక్టర్జీ నాగపూర్ కేంద్రంగానే తయారు చేశారన్నారు. అయితే.. ఆయన కుటుంబానికి మూలం మాత్రం కందకుర్తే అని అన్నారు.
డాక్టర్జీ స్మృతి మందిరం నాగపూర్ లో వుందని, ఈ విషయం అందరికీ తెలుసన్నారు. అయితే అక్కడ స్మృతి మందిరం వుండటం అత్యంత స్వాభావికమైన అంశమన్నారు. ఆ స్మృతి మందిరాన్ని చూడడానికి ప్రజలు కూడా వస్తుంటారన్నారు. అయితే.. నాగపూర్ లో స్మతి మందిరం ఎలాగైతే వుందో, కందకుర్తిలో కూడా డాక్టర్జీ స్మృతి నిమిత్తం ఏదైనా వుండాలని అందరూ అనుకుంటారన్నారు. ఇది స్వాభావికం కూడా అని పేర్కొన్నారు. ఇందులో భాగంగానే 32 సంవత్సరాల క్రితం సంఘ అధికారులు కొందరు డాక్టర్జీ స్మృతి మందిరం వుండాలని ఇదే తేదీన (ఏప్రిల్ 11) న సంకల్పించారని, దీని కార్యరూపం కూడా ఇదే తారీఖున (ఏప్రిల్ 11) న మనకు అనుభూతిలోకి వచ్చిందని హర్షం వ్యక్తం చేశారు.

అయితే.. తాను ఈ పర్యటనకు వచ్చిన తర్వాత రెండు ముఖ్యమైన విషయాలు తెలిసాయన్నారు. పక్షి రాజు గరుత్మంతుని తల్లి వినతికి ముక్తి కలిగింది కందకుర్తిలోనే అని చిత్ర ప్రదర్శన చూడగా తెలిసిందని, మరో విషయం ఇక్కడి నుంచి వచ్చిన డాక్టర్జీ సంఘ్ ను ప్రారంభించారన్నది రెండో విషయం. ఈ రెంటికీ అద్భుతమైన సంబంధం వుందన్నారు.అయితే ఇంతటి స్ఫూర్తి మాత్రం డాక్టర్జీకి ఈ భూమి నుంచే లభించిందన్నారు. ఇక్కడికి ఛత్రపతి శివాజీ మహారాజ్ వచ్చారని, అహల్యాబాయి హోల్కర్ వచ్చారన్నారు.దీనిని బట్టి చూస్తే దీని చుట్టూ ఓ కార్య సూత్రం ఇమిడి వుందన్న విషయం అర్థమైపోతుందన్నారు.
ఈ స్ఫూర్తి కేంద్రంగా అనేక సేవా ప్రకల్పాలు జరగాలని అనుకుంటున్నారో అవి పెరగాలని, ఇదో స్ఫూర్తి కేంద్రంగా నిలిచిపోవాలని ఆకాంక్షించారు. దేశ భక్తికి సంబంధించిన స్ఫూర్తి, నిస్వార్థంగా జీవించే స్ఫూర్తి, సమాజంలో వున్న నిరుపేదలకు సేవల చేసే స్ఫూర్తి, పేదరికం నుంచి వారిని బయటికి తీసే స్ఫూర్తి ఈ కేంద్రం నుంచి రావాలన్నారు. ప్రామాణికతతో సద్గుణాల ఉపాసన ఈ కేంద్రం నుంచి జరగాలన్నారు. ఇలాంటి పనులు, ఇలాంటి స్ఫూర్తి ఇక్కడి కార్యక్రమాల నుంచి ఉద్భవించాలన్నారు.
అలాగే ప్రజలందరూ యేడాదికి ఓ సారి, సెలవు రోజుల్లో ఈ స్ఫూర్తి మందిర్ కి రావాలని, దీని ద్వారా ఇక్కడి చరిత్ర తెలుస్తుందని సూచించారు. దీని ద్వారా ఇక్కడి మట్టికి ఎంత శక్తి వుందో తెలిసి వస్తుందని, ఇక్కడి నుంచే తన తల్లి దాస్య శృంఖలాలు తెంచడానికి గరుడుడు బయల్దేరాడని, అలాగే 100 ఏళ్లు పూర్తిచేసుకొని, తమ ధ్యేయం కోసం పనిచేస్తున్న సంఘ్ కూడా ఇక్కడి నుంచే ఉత్పన్నమైందని తెలుసుకుంటారని, ఇంతటి ప్రతిభ ఈ మట్టికి వుందన్న విషయం అందరికీ అర్థమవుతుందన్నారు.

ఈ మట్టి ద్వారా వచ్చే అమృతం తమకు వద్దని, కేవలం సేవలో మాత్రమే తరిస్తాం, సేవే మాకు పరమావధి అన్న స్ఫూర్తిని కూడా ఈ ప్రదేశం నుంచి పొందాలని భాగవత్ సూచించారు.
చిన్నతనం నుంచే భారతమాత దాస్య శృంఖలాలను తెంచాలన్న దృఢ సంకల్పంతో డాక్టర్జీ వుండేవారని, డాక్టర్జీ మొదటి నుంచి కూడా ఏ పని చేసినా అత్యంత ప్రామాణికంగా,నిస్వార్థంగానే పనిచేసేవారన్నారు. భారతీయులను బానిసలుగా చూస్తున్న ఆఆంగ్లేయులను భారత్ నుంచి తరిమికొట్టాలన్న నిశ్చయంతో వుండేవారని, అలాగే భారతమాతను వారి నుంచి విముక్తం చేసి, స్వాతంత్రురాలిని చేయాలన్న దృఢ సంకల్పంతో వుండేవారన్నారు. అలాగే ఇదే దృక్పథం, ఆలోచనతో పనిచేసే వారందరితో కలిసి కార్యకర్తలా పనిచేశారని పేర్కొన్నారు. విప్లవ వీరులతో కూడా పనిచేశారన్నారు. అలాగే రాజకీయాల ద్వారా పోరాటం చేస్తూ దేశానికి స్వాతంత్రం తీసుకురావాలనుకున్న వారితోనూ డాక్టర్జీ కలిసి పనిచేశారని గుర్తు చేశారు.
అయితే ఎక్కడ పనిచేసినా, ఎందులో పనిచేసినా అత్యంత ప్రామాణికతతోనే డాక్టర్జీ పనిచేశారని, ఎక్కడికి వెళ్లినా, ఎవరిని అడిగినా.. వారందరూ డాక్టర్జీ ప్రామాణికత గురించే మొదట చెప్పేవారన్నారు. ఎందుకంటే ఆయన అంత ప్రామాణికంగా వుండేవారు కాబట్టి అని వివరించారు. స్వయంసేవకులే కాదు, బయటి వ్యక్తులు కూడా ఇదే చెప్పేవారని చెబుతూ, రాజ్ బిహారీ బసు అనే రచయిత, తన రెండు మూడు పుస్తకాల్లో కూడా డాక్టర్జీ గురించి చెప్పారని, ‘‘హెడ్గేవార్ అనే యువకుడు నాగపూర్ నుంచి వచ్చారని, అత్యంత ప్రామాణికతతో పనిచేస్తారు’’ అని చెప్పారని ఉటంకించారు.
అలాగే ఇంకో విలక్షమైన గుణం కూడా డాక్టర్జీ దగ్గర వుందని, బయటి వ్యక్తులతో పాటు సంఘ స్వయంసేవకులు కూడా నిత్యం చెప్పేవారని అదే ఆయన ‘‘స్నేహగుణం’’ అని తెలిపారు. ప్రామాణికత, స్నేహం అన్న రెండు లక్షణాలతోనే డాక్టర్జీ నిరంతరం పనిచేశారన్నారు.
అయితే డాక్టర్జీ ఈ దేశం గురించి ఆలోచిస్తూ.. మనల్ని పాలించడానికి వచ్చిన మొదటి వారు ఆంగ్లేయులు కారని, గతంలోనూ కొందరు వచ్చారన్నారు. వారు కూడా మనల్ని దోచుకున్నారని, బానిసలుగా చూశారని గ్రహించారన్నారు. కాబట్టి, వారిది తప్పుకాదని, మనలోనే ఏదైనా పొరపాటు వుందా అని డాక్టర్జీతో పాటు మరికొంత మంది ఉద్యమకారుల మనస్సులో మెదిలిందని, ఈ పొరపాటు కారణంగానే ఇన్ని సంవత్సరాల పాటు పాలించారని, హింసిస్తూ వస్తున్నారన్న కృత నిశ్చయానికి వచ్చారని, అందుకే ఈ లోపాన్ని అధిగమించాలని నిర్ణయించుకున్నారని మోహన్ భాగవత్ పేర్కొన్నారు.

హిందూ సమాజంలో ఐక్యత అన్న భావనే తక్కువగా వుందని, వాస్తవానికి హిందూ సమాజంలో వున్న వైవిధ్యాన్ని గౌరవించే సంప్రదాయం కూడా వుందని గుర్తు చేశారు. అన్ని దారులూ సరైనవేనని, కానీ మనం ఆచరించే దానిని సరిగ్గా ఆచరించాలని, ఇతరుల సంప్రదాయాన్ని గౌరవించాలని, వారిని కష్టపెట్టవద్దని, కలిసి మెలిసి నడవాలని హిందూ ధర్మం చెబుతోందన్నారు.
కానీ హిందూ సమాజంలో జాతిపరమైన, ప్రాంతాల పరంగా, భాషల పరంగా విభేదాలు కొనసాగుతున్నాయి. అందుకే హిందుత్వం అన్న ఆధారంతో హిందువులను ఐక్యం చేయాలని డాక్టర్జీ సంకల్పించారన్నారు. నిజానికి అందర్నీ కలిపేదే హిందుత్వమని, కానీ మొదట హిందువులు హిందుత్వం అన్న పునాదిపై సమరసతా భావాన్ని నిర్మించాలని అనుకున్నారన్నారు.
ఇక..అన్ని సంవత్సరాల పాటు నిరంతరాయంగా బానిసలుగా వున్న కారణంగా, హింసలకు గురైన కారణంగా కోట్ల మంది వున్నా.. తాను ఒక్కడినే అన్న భావం కారణంగా హిందువులు భయంలో మగ్గిపోయారని, ఇది కూడా ఓ కారణమేనని అన్నారు. హిందువుల మనస్సుల్లోంచి భయాన్ని పోగొట్టాలని, వారిని నిర్భయులుగా తయారు చేయాలని, అలాగే బలాఢ్యులుగా కూడా చేయాలని నిర్ణయించుకున్నారన్నారు. కానీ.. నిర్భయులుగా తయారు చేయడం, బలాఢ్యులుగా తయారు చేయడం ఎవరినో కొట్టడానికో, దండించడానికి కాదని, అందుకే వారిని శీలసంపన్నులుగా కూడా చేయాలి అని సంకల్పించారన్నారు.
అలాగే ఇలాంటి పరిస్థితులను బాగు చేయాలని, దేశం కోసం పనిచేయడానికి తమ జీవితాలను సమర్పితం చేయడానికి ఎంతటి విజ్ఞానం కావాలో, దాని కోసం డాక్టర్జీ తపస్సు చేశారని గుర్తు చేశారు. దీనిని నిరంతరాయంగా కొనసాగించారన్నారు.రానూ రానూ డాక్టర్జీ ధ్యేయ నిష్ఠ మరింత సుదృఢమైంది. ఈ సంకల్ప బలాన్ని మధ్యలోనే వదిలేయలేదు. కొనసాగించారని పేర్కొన్నారు.
డాక్టర్జీ వున్న సమయంలో సంఘ ప్రార్థనను కొందరు పెద్దలు కలిసి నిర్ణయించారని, ఈ ప్రార్థనలో ఈ ఐదు గుణాలనూ పొందుపరిచారన్నారు. సంఘ కార్యం నుంచి ఈ సద్గుణాలు సమాజంలో ఉద్భవిస్తాయి. అలాగే సంఘ శాఖకు వచ్చే వారిలో కూడా ఈ సద్గుణాలు వచ్చేస్తాయన్నారు. హిందూ సమాజం ఎలా వుండాలో ఓ ఆదర్శవంతమైన రూపం దీని నుంచి వస్తుంది. ఈ గుణాలు లేకుంటే స్వాతంత్రం కోసం పదే పదే పోరాటాలు చేయాల్సి వస్తుందని, మూలం నుంచే రోగాన్ని తీసేయాలని డాక్టర్జీ సంకల్పించారని పేర్కొన్నారు.
సమాజంలో అన్ని గుణాలు వున్నా.. కొన్ని తక్కువగా వున్నాయని భావించారు. అందుకే సమాజాన్ని ఏకం చేయాలని, సద్గుణాలు నింపాలని, భావించారని వివరించారు. సమాజం కోసం ఎవరో ఒకరు ముందుకు వచ్చి పని చేయాల్సిందేనని, అందులో భాగంగానే డాక్టర్జీ ఓ అడుగు ముందుకు వేశారని తెలిపారు. అందులోంచి పుట్టిందే సంఘ్. ఎవరికీ వ్యతిరేకంగా సంఘ్ స్థాపన జరగలేదు. అందరి పనులు పూర్తి చేయడానికే స్థాపించబడిందని మోహన్ భాగవత్ పునరుద్ఘాటించారు.