దేశ వ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్న ఉద్యోగులను తొలగించిన లెఫ్టినెంట్ గవర్నర్
జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులను విధుల నుంచి తొలగిస్తూ కీలక ఉత్తర్వులిచ్చారు. ఈ ఇద్దరిలో ఒకరు పోలీసు విభాగంలో పనిచేస్తుండగా.. రెండో ఉద్యోగి పబ్లిక్ వర్క్స్ డిపార్టమెంట్ లో అసిస్టెంట్ గా పనిచేస్తున్నాడు. వీరిద్దరూ దేశ వ్యతిరేక కార్యకలాపాల్లో భాగం పంచుకుంటున్నట్లు తేలింది. దీంతో రాజ్యాంగంలోని ఆర్టికల్ 311 కింద విధుల నుంచి గవర్నర్ తొలగించారు.
గవర్నర్ తీసుకున్న నిర్ణయాన్ని పీడీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఎల్జీగా మనోజ్ సిన్హా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి చాలా మంది ఉద్యోగులను ఇలాగే తొలగించారని, ఇలాంటి చర్యలకు దూరంగా వుండాలని మండిపడింది. అయితే జాతీయవాదులు మాత్రం ఈ చర్య సరైనదేనని సమర్థిస్తున్నారు.
గతంలో కూడా రాజకీయ నేతలు ఇలాంటి మాటలే మాట్లాడారు. దేశ వ్యతిరేక కార్యకలాపాల్లో వుండే ఉద్యోగులను తీయడంపై కొందరు తప్పుబట్టారు. అయితే… దీనిపై ఎల్జీ తప్పుకూడా బట్టారు. రాజకీయ నేతలు చేసే ప్రయత్నాలను గట్టిగా తిప్పికొట్టారు. దేశ వ్యతిరేక ప్రవర్తన, చర్యలను ఏమాత్రం ఉపేక్షించేది లేదని తాజాగా జరిగిన ఓ ఇంటర్యూలో ఎల్జీ మనోజ్ సిన్హా ప్రకటించారు.