దేశ సంస్కృతిని ప్రతిబింబించే సినిమా కథలు రావాలి : ఆయుష్ నడింపల్లి

భారతీ ఫిల్మ్ సొసైటీ భాగ్యనగర్ ఆధ్వర్యంలో భారతీయ చలన చిత్ర పితామహుడు దాదా సాహెబ్ ఫాల్కే జన్మదినోత్సవ సభ శోభాయమానముగా జరిగింది. భాగ్యనగరం లోని ఫిల్మ్ నగర్ కో ఆపరేటివ్ సొసైటీ ప్రాంగణంలోని ప్రొడ్యూసర్ కౌన్సిల్ సమావేశ మందిరం లో ఈ కార్యక్రమం జరిగింది. సమావేశానికి అధ్యక్షత వహించిన తెలుగు చలన చిత్ర దర్శక సంఘం అద్యక్షులు ప్రఖ్యాత దర్శకుడు శ్రీ వీర శంకర్ బైరిశెట్టి గారు మాట్లాడుతూ ఇలా దాదాసాహేబ్ ఫాల్కే జన్మదినోత్సవం జరపడం నిజంగా ముదావహం అనీ ఇలాంటి కార్యక్రమాలు భారతీ ఫిల్మ్ సొసైటీ సభ్యుల నిబద్ధత ను సూచిస్తుందనీ అన్నారు. చలన చిత్ర రంగంలో అన్ని రంగాలవారూ కూడా ఇలాంటి కార్యక్రమాలు చేస్తే ఇంకా బాగుంటుందని అన్నారు. అలాగే పాఠశాల స్థాయి లో ఫిల్మ్ అప్రిసియేషన్ వంటి కోర్సులు పెట్టాలని తద్వారా మంచి సినిమా లు వస్తాయని అభిప్రాయపడ్డారు. సంస్థ సభ్యుల ను మనస్పూర్తిగా అభినందిస్తున్నానని అన్నారు.
రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ దక్షిణ మధ్య క్షేత్ర ప్రచార ప్రముఖ్ ఆయుష్ నడింపల్లి ముఖ్య వక్త గా తమ సందేశాన్ని అందించారు. దాదా సాహేబ్ ఫాల్కే ఇంగ్లాండ్ లో క్రీస్తు జీవితం అన్న సినిమా చూడగానే ఆయన భారతీయ ఆత్మ పురాణాల ను చలన చిత్రాలుగా తీయాలని పరితపించిందనీ, అందుకే రెండు మూడు రోజుల పాటూ ఆయన కంటి మీద కునుకు లేనంతగా చలనచిత్రం గురించే ఆలోచిస్తూ ఉండి పోయారనీ అన్నారు. ఇంగ్లాండ్ లో సినిమాలు ఎలా షూటింగ్ చెయ్యాలో చక్కగా నేర్చుకున్నా, అక్కడ ఎక్కువ అవకాశాలు అంతులేని ఆదాయం ఉన్నా, మాతృభూమి పై ప్రేమ ఆయన బొంబాయి తిరిగి వచ్చేలా చేసిందని అన్నారు. ఫాల్కే ను స్మరించుకున్న ప్రతిసారీ వారి శ్రీమతి సరస్వతి అమ్మ ను కూడా స్మరించుకోవాలనీ అన్నారు. ఆవిడ తన నగలను తాకట్టు పెట్టి ‘ రాజా సత్యహరిశ్చంద్ర’ సినిమా కు పెట్టుబడి సమకూర్చిందని గుర్తు చేశారు. ఇదే భారతీయ కుటుంబ వ్యవస్థ యొక్క గొప్పతనం అన్నారు. అలా తనని తాను అర్పించుకుని మరీ మొదటి చలనచిత్రం నిర్మించిన ఆ వైతాళికుడు దాదాసాహేబ్ ఫాల్కే ను భారతీయ చలనచిత్ర రంగ పితామహుడు అని మనం కొనియాడుతున్నాము .
తనని తాను అలా అర్పించుకునే విధానాన్ని ఈ దేశం ఎప్పుడూ పూజిస్తుంది. దాదాసాహేబ్ ఫాల్కే ఎలాగయితే పురాణ కధలను సినిమాలు గా తీశారో అలాగ ప్రస్తుతం సినిమా ఔత్సాహికులు కూడా మన దేశ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా కధలు తయారు చేసుకోవాలి. మన సంస్కృతి అంటేనే పర్యావరణ అనుకూల విధానం, మన సంప్రదాయాలు వసుధైక కుటుంబం అనే లక్ష్యంతో ఉంటాయని గుర్తు చేసుకోవాలి. పౌర బాధ్యత లు మనకు శిరోధార్యం అందుకే మన చలనచిత్రాలు కూడా తదనుగుణంగా ఉండాలి. సమాజం పట్ల నిబద్ధత తో సినిమాలు రావాలని, దేశం పట్ల ప్రేమ అంటెనే సమాజం పట్ల ప్రేమ.
అందుకే రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ వ్యక్తి నిర్మాణం ద్వారా సమాజ నిర్మాణానికి ఎలా పనిచేస్తుందో . అలాగే ఔత్సాహిక కళాకారులు దర్శకులు కూడా చక్కని కధలు కధనంతో మంచి సినిమాలు తీయాలని కోరారు. దాదాసాహేబ్ ఫాల్కే జన్మదినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులు సునీల్ మహేశ్వరి, ప్రవీణ్ రామరాజు, తెలంగాణ ప్రాంత ప్రచార ప్రముఖ్ కట్టా రాజగోపాల్ గారు మొదలైన వారు చలన చిత్ర పరిశ్రమకు చెందిన నటులు, దర్శకులు, సంగీత నిపుణులు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. సీతారామరాజు రాజశేఖర్ గారి వందన సమర్పణలో కార్యక్రమం ముగిసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *