ధైర్యంగా ఎదుర్కొందాం.. ఆందోళన అవసరం లేదు

సమాచారభారతి కోవిడ్‌ అవగాహన కార్యక్రమంలో  డాక్టర్ల సూచనలు, సలహాలు

శుభ్రత పాటించడం, మాస్క్, ‌సానిటైజర్‌ ‌వాడకం, భౌతిక దూరం పాటించడం వంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా కోవిడ్‌ ‌బారిన పడకుండా ఉండవచ్చని, ఒకవేళ వ్యాధి వచ్చినా సులభంగా బయటపడవచ్చని కోవిడ్‌ ‌గురించి సమాచారభారతి ఏర్పాటు చేసిన ఆన్‌లైన్‌ అవగాహన కార్యక్రమంలో డాక్టర్లు సూచించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖ వైద్యులు డా. వేద్‌ ‌ప్రకాష్‌, ‌డా.మారుతి శర్మ విలువైన సమాచారంతోపాటు, పలు ప్రశ్నలకు సమాధానా లిచ్చారు.

ధర్మానికి నాలుగు పాదాలలో శౌచం (శుభ్రత)ఒకటని, ఇది పాటిస్తే ఎలాంటి వ్యాధులు దరిచేరవని డా. మారుతి శర్మ అన్నారు. ప్రతి రోజు క్రమం తప్పకుండా వ్యాయామం, సూర్య నమస్కారాలు చేయడం, కనీసం 20 నిమిషాలు ఎండలో నిలబడటం, సాధారణ, పౌష్టిక ఆహారం తీసుకోవడం వంటివి పాటిస్తే సరిపోతుందని, ఆందోళనకు గురికాకుండా, అలాగని నిర్లక్ష్యం వహించకుండా ఉండడమే ముఖ్యమని ఆయన అన్నారు. వ్యాధి లక్షణాలు కనిపించినవారు ఆక్సీమీటర్‌ ‌ద్వారా శరీరంలో ఆక్సిజన్‌ ‌స్థాయిని చూసుకోవాలని, 93,90 వరకు రీడింగ్‌ ఉం‌టే ఫరవాలేదని, అంతకంటే తగ్గితే జాగ్రత్తపడాలని సూచించారు. ఎక్కువగా ఉపయోగించే చేతి మధ్యవేలుకు ఆక్సీమీటర్‌ ‌పెట్టుకుని, ఒక నిముషం తరువాత రీడింగ్‌ ‌తీసుకోవాలని చెప్పారు. శరీరమే గొప్ప వ్యవస్థ అని, అందుకని అనవసరంగా యాంటీబయాటిక్‌ ‌మందులు వాడే అవసరం లేదని ఆయన సూచించారు.

కార్యక్రమంలో పాల్గొన్న మరొక వైద్యనిపుణులు డా. వేద్‌ ‌ప్రకాష్‌ ‌మాట్లాడుతూ రెండు రోజులపాటు ఏదైనా అనారోగ్యం ఉంటే వెంటనే మిగిలినవారితో భౌతిక దూరం పాటించడం, వైద్యులను సంప్రదించడం వంటివి చేయాలని సూచించారు. ఇలా ‘దో దిన్‌ – ‌దో కామ్‌’ అనే పద్దతి ద్వారా ఈ అంటువ్యాధి వ్యాపించకుండా నివారించవచ్చని అన్నారు. వాక్సిన్‌ల గురించి మాట్లాడుతూ మనదేశంలో తయారైన రెండు వ్యాక్సిన్‌లలో ఏదైనా సురక్షితమైనదేనని, అందుబాటులో ఉన్న వ్యాక్సిన్‌ ‌వెంటనే వేయించుకోవాలని సూచించారు. వ్యాక్సిన్‌ 70, 80‌శాతం వరకు వ్యాధిని నివారిస్తుందని చెప్పారు. గర్భిణులు, బాలింతలు తప్ప అందరూ వాక్సిన్‌ ‌తీసుకోవచ్చును.

అలాగే గతంలో ఏవైనా వాక్సిన్‌ ‌లేదా ఇంజక్షన్‌లు తీసుకున్నప్పుడు తీవ్రమైన ఇబ్బందులు కలిగినవారు కూడా వైద్యుల సలహా మేరకే వ్యాక్సిన్‌ ‌తీసుకోవాలని చెప్పారు. వ్యాధి లక్షణాలు ఉన్నవారు రెండవ దశలో అవసరమైతే ఆక్సిజన్‌ ‌తీసుకోవడం, ప్రత్యేక సమస్యలు వచ్చినప్పుడు మాత్రమే స్టెరాయిడ్‌ ‌లు వాడటం, రక్త సంబంధ సమస్యలు వచ్చినప్పుడు మాత్రమే ప్రత్యేక మందులు తీసుకోవడం చేయాలని సూచించారు. రెమెడిసివిర్‌ ‌వంటి మందులు అవసరమేలేదని, ఈ మందులు ఇంకా పరీక్ష దశలోనే ఉన్నాయని స్పష్టం చేశారు. ప్లాస్మా వైద్యం కూడా అవసరం లేదని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *