నాగపూర్ లో అల్లర్లు… రాళ్లదాడి… వాహనాల దగ్ధం
నాగపూర్ లోని మహల్ ప్రాంతంలో ఒక్కసారిగా అల్లర్లు చెలరేగాయి.శంభాజీ మహారాజ్ హంతకుడు ఔరంగజేబు సమాధి మహారాష్ట్రలో వుండకూడదని, దానిని వెంటనే తొలగించాలని హిందువులు డిమాండ్లు చేశారు. ఈ శాంతియుత నిరసన కార్యక్రమం తర్వాతే హింస చెలరేగినట్లు తెలుస్తోంది. పుకార్ల నేపథ్యంలో మహల్ ప్రాంతంలో రాళ్లదాడి, వాహనాల దగ్ధం జరిగింది. నిరసనకారులు పోలీసులపైకి కూడా రాళ్లు రువ్వారు. అయితే నిప్పంటిచిన వాహనాల్లో పేలుళ్ల శబ్దం కూడా వినిపించినట్లు సమాచారం.
ఈ అల్లర్లలో దాదాపు 20 మంది గాయపడ్డారు. చిట్నిస్ పార్క్ మరియు మహల్ ప్రాంతాలలో ఆందోళనకారులను చెదరగొట్టడానికి పోలీసులు టియర్ గ్యాస్ కూడా ప్రయోగించారు. ఈ హింసలో పోలీసులకు కూడా గాయాలయ్యాయి. చికిత్స కోసం వారిని ఆస్పత్రికి తరలించారు. శాంతిభద్రతలను కాపాడేందుకు, పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు 144 సెక్షన్ విధించారు.
కొన్ని మీడియా సంస్థల సమాచారం ప్రకారం సోమవారం మధ్యాహ్నం శివాజీ విగ్రహం దగ్గర ఔరంగజేబుకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు.ఔరంగజేబు దిష్టిబొమ్మను కూడా దహనం చేశారు. శంభాజీ హంతకుడు ఔరంగజేబు సమాధి మహారాష్ట్రలో వుండకూడదని, వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం అంతా ప్రశాంతంగానే సాగింది. ఇది జరిగిన కాసేపటికే రాత్రి 7:30 గంటల ప్రాంతంలో ఓ గుంపు శివాజీ చౌక్ సమీపంలోకి చేరుకున్నట్లు తెలుస్తోంది. వీరు ఔరంగజేబుకి మద్దతుగా నినాదాలు చేశారు. మరోవర్గం కూడా ప్రతిస్పందిస్తూ నినాదాలు చేశారు. దీంతో రాళ్లదాడి మొదలైనట్లు సమాచారం.
మరోవైపు వీటిపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్పందించారు. కొన్ని పుకార్ల నేపథ్యంలో నాగపూర్ లో ఉద్రిక్తతలు చెలరేగాయన్నారు. శాంతిభద్రతల దృష్ట్యా అందరూ సంయమనం పాటించాలన్నారు. మరోవైపు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కార్యాలయం కూడా స్పందించింది. శాంతిభద్రతలను కాపాడటంలో అందరూ సహకరించాలని కోరింది. ప్రజలు పాలనా యంత్రాంగానికి సహకరించాలని కోరింది. పోలీసులు నిరంతరం పరిశీలిస్తూనే వున్నారని పేర్కొంది.