నాడీ పట్టుకొని వైద్యం కుదరకపోవడంతో… వ్యవసాయంలో పరిశోధనలతో మేటి
వైద్యురాలిగా నలుగురికి ప్రాణం పోయాలని అనుకుంది. కానీ కుదరలేదు. వ్యవసాయంలో పరిశోధనలు చేస్తూ పది మంది కడుపు నిండేలా చేస్తోంది. ఇలా వ్యవసాయంలో పరిశోధనలు చేస్తూ, పది మందికి పట్టెడు అన్నం పెడుతూ… తృప్తి పడుతోంది కొత్తూరు గ్రీష్మా రెడ్డి. స్వస్థలం మహబూబ్ నగర్ జిల్లా వింజమూరు. నాన్న కొత్తూరు శ్రీనివాస రెడ్డి కూడా రైతే.అయితే వీరిది రైతు కుటుంబం. కూతుర్ని వైద్యురాలిగా చూడాలనుకున్నారు. అయితే.. అది వీలు కాలేదు. అయినా ఆమె ఎక్కడా అధైర్య పడలేదు. వ్యవసాయం మీద పరిశోధన సాగించాలని నిర్ణయించుకుంది. తండ్రి మూలాలు కూడా వ్యవసాయమే కావడంతో సరేనన్నారు. దీంతో రైతులకు ఉపయోగపడే ప్రయోగాలు చేసి, వ్యవసాయాన్ని నిలబెట్టాలని ఆ కుటుంబం నిర్ణయించింది.
దీంతో గ్రీష్మారెడ్డి వ్యవసాయం వైపు మొగ్గు చూపారు. మహారాష్ట్రంలో ఎమ్మెస్సీ అగ్రికల్చర్ పూర్తి చేసింది. అత్యంత ప్రతిభ కూడా చూపించడంతో గవర్నర్ చేతుల మీదుగా గోల్డ్ మెడల్ ని అందుకున్నారు. అనంతరం పీహెచ్ డీ కూడా చేసింది. ఐకార్ భారతీయ నూనె గింజల పరిశోధనా సంస్థలో పరిశోధన చేసింది. ‘‘ఆముదం పంటలో బూడిద తెగులు’’ అనేది పరిశోధనాంశం. దీని తర్వాత ఐకారలో వ్యవసాయ శాస్త్రవేత్తల ఉద్యోగాలకు ప్రకటన వచ్చింది. జాతీయ స్థాయిలో నాలుగో ర్యాంకు రావడంతో దరఖాస్తుకు బాగా కలిసొచ్చింది. ప్లాంట్ పాథాలజీ శాస్త్రవేత్తగా ఎంపికైంది. మొక్కల వ్యాధి అధ్యయన శాస్త్రంలో మేటిగా నిలిచింది. వ్యవసాయ రంగంలో పంటల చీడపీడల నివారణం కోసం పరిశోధనలు చేయడమే తన లక్ష్యమన్నారు. వ్యవసాయంలో పెరెన్నికగన్న శాస్త్రవేత్తగా విఖ్యాతి చెందింది.