నారదుడు
నారదుడు బ్రహ్మ మానసపుత్రుడని, త్రిలోక సంచారి అని, నారాయణ భక్తుడని ప్రతీతి. ఉపనిషత్తులు, పురాణములు, ఇతిహాసములలో నారదుని సంఘటనలు బహుళంగా వస్తాయి. భాగవతం ప్రథమ స్కందంలో నారదుడు వేదవ్యాసునికి భాగవతం రచించమని బోధిస్తాడు. రామాయణం బాలకాండలో నారదుడు వాల్మీకికి ఉత్తమ పురుషుడైన శ్రీరాముని గురించి చెప్పి రామాయణం వ్రాయమని, అది ఆచంద్రతారార్కం నిలచి ఉంటుందని చెప్తాడు.
నారదుడు స్వయంగా తన గాధను వ్యాసునికి తెలిపాడు. తాను పూర్వజన్మ పుణ్యకారణంగా హరి కథా గానంచేస్తూ ముల్లోకాలలో సంచరించ గలుగుతున్నానని చెప్పాడు.ప్రళయ కాలం తర్వాత బ్రహ్మ లోకాలను సృష్టించడం ఆరంభించినపుడు బ్రహ్మ ప్రాణముల నుండి మరీచి మొదలైన మునులతో పాటు నారదుడు కూడా జన్మించాడు.
నారదుడు 64 విద్యలలో ప్రావీణుడు. వేదోపనిషత్తులు, పురాణ ములు బాగా తెలిసిన వాడు. న్యాయ, ధర్మ తత్వజ్ఞుడు. పరస్పర విరుద్దములైన వివిధ విధి వాక్యాలను సమన్వయ పరచగల నీతిజ్ఞుడు. మంచి, చెడులను వేరువేరుగా గుర్తించటంలో నిపుణుడు. సమస్త బ్రహ్మాండ ములందు, ముల్లోకము లందు జరుగు సంఘటనలను తన మోగ బలముచే దర్శించగలడు. వైశాఖ మాసంలో పౌర్ణమి తరువాత రోజున నారద జయంతిగా బావిస్తారు.
నారద జయంతి రోజును పాత్రికేయ దినోత్సవంగా జరుపుతారు. సృష్టిలో నారదుడు మొదటి పాత్రికేయుడు. ఆరోజు జరిగే సదస్సులలో నారదుడిని పాత్రికేయ రంగంలో ఆదర్శంగా తీసుకొని సమాజ కల్యాణం కోసం పనిచేయాలని సంకల్పం తీసుకొంటారు.