నిజామాబాద్ కేంద్రంగా జాతీయ పసుపు బోర్డు ప్రధాన కార్యాలయం
తెలంగాణ పసుపు రైతులకు కేంద్ర ప్రభుత్వం సంక్రాంతి కానుక ప్రకటించింది. నిజామాబాద్ కేంద్రంగా జాతీయ పసుపు బోర్డు ప్రధాన కార్యాలయం ఏర్పాటుకు ఓకే చెప్పింది. అంతేకాకుండా సంక్రాంతి రోజే ఆ కార్యాలయ ప్రారంభం కూడా జరగనుంది. దీనిని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వర్చువల్ గా ప్రారంభిస్తారు. ఈ మేరకు కేంద్రం ఓ ప్రకటన జారీ చేసింది. అంతేకాకుండా జాతీయ పసుపు బోర్డు చైర్మన్ గా పల్లె గంగారెడ్డి బాధ్యతలు స్వీకరించారు. దీంతో పసుపు రైతుల సమస్యల పరిష్కారంపై కేంద్రం ఓ విధాన ప్రకటన చేసే అవకాశాలున్నాయి.
పసుపు బోర్డు ఏర్పాటుతో రైతులకు కొత్త అవకాశాలు కలుగనున్నాయి. పసుపు పంటకు గిట్టుబాటు ధరలు దక్కనున్నాయి. బోర్డు ద్వారా పసుపు ప్రాసెసింగ్ యూనిట్లు నెలకొల్పే అవకాశాలు లేకపోలేదు. ఇకపై పసుపు ఎగుమతులకు గణనీయమైన అవకాశాలు ఉంటాయని భావిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నిజామాబాద్‌లో జాతీయ పసుపుబోర్డు ఏర్పాటు చేయడం పట్ల ఎంపీ ధర్మపురి అర్వింద్ హర్షం వ్యక్తం చేశారు. పసుపురైతుల కష్టాలను గుర్తించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బోర్డు ఏర్పాటుచేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. తమ 37 సంవత్సరాల పసుపురైతుల కల ఈనాడు నెరవేరడం సంతోషకరమని పేర్కొన్నారు.