నిరుపేద ముస్లింల జీవితాలు ఈ బిల్లుతో మారుతాయి : ఆలిండియా ముస్లిం జమాత్
లోక్ సభలో వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదం పొందడాన్ని ఆలిండియా ముస్లిం జమాత్ జాతీయ అధ్యక్షుడు మౌలానా షహబుద్దీన్ రజ్వీ స్వాగతించారు. ఈ బిల్లుకు అనుకూలంగా ఓటు వేసిన ఎంపీలందరికీ ధన్యవాదాలు ప్రకటించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి అభినందనలు తెలియజేశారు. చెడును నిర్మూలించేందుకు కేంద్ర ప్రభుత్వం ఓ మంచి ముందడుగు వేసిందని హర్షం వ్యక్తం చేశారు. ఈ బిల్లు వల్ల పేద ముస్లింలకు బాగా లబ్ధి చేకూరుతుందన్నారు. అలాగే వారి ఆర్థిక పరిస్థితులు కూడా బాగవుతాయన్నారు. పారదర్శకత, సంస్కరణల దిశగా ఓ అడుగు పడిందన్నారు. ఈ బిల్లు వక్ఫ్ ఆస్తుల దుర్వినియోగాన్ని అరికడుతుందన్నారు.
మరోవైపు ఈ సందర్భంగా గతంలో వక్ఫ్ బోర్డులో జరిగిన అవకతవకలను కూడా ఎత్తి చూపారు. గతంలో బోర్డు చైర్మన్, సభ్యులు ల్యాండ్ మాఫియాతో కలిసి కోట్లాది రూపాయల విలువైన భూములను విచ్చలవిడిగా విక్రయించేవారని, లేదంటే లాక్కొనేవారన్నారు. వక్ఫ్ ఆస్తి ద్వారా వచ్చే ఆదాయాన్ని పేదలకు, వితంతువులకు, అనాథ ముస్లింలకు ఖర్చు చేయాలన్నదే ప్రధాన ఉద్దేశమని, కానీ అలా జరగలేదన్నారు. వారంతా డబ్బును తమ జేబుల్లో వేసేసుకున్నారని మండిపడ్డారు. ఇప్పుడు మాత్రం ఈ బిల్లుతో అంతా మంచే జరుగుతుందన్నారు. పేద ముస్లింల ఆర్తిక పరిస్థితిలో మార్పు వస్తుందన్నారు.