‘నేతాజీ సాహసం, మేధోశక్తి అద్వితీయం’
‘‘నేతాజీ’’ పుస్తక ఆవిష్కరణలో శ్రీ దత్తాత్రేయ హోసబలే
నేతాజీ సాహసం, మేధోశక్తి అద్వితీయం అని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ కార్యవాహా శ్రీ దత్తాత్రేయ హోసబలే జీ అన్నారు. ప్రముఖ పాత్రికేయులు శ్రీ ఎంవీఆర్ శాస్త్రీ రచించిన ‘‘నేతాజీ’’ పుస్తక ఆవిష్కరణ సభ భాగ్యనగర్‌లోని (హైదరాబాద్) రవీంద్ర భారతీ ఆడిటోరియంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ కార్యవాహ శ్రీ దత్తాత్రేయ హోసబలే, రామకృష్ణ మఠానికి చెందిన పూజ్య స్వామి శ్రీ శితికంఠానంద, జస్టిస్ శ్రీ ఎల్.నర్సింహ రెడ్డి, పద్మ అవార్డు గ్రహీత శ్రీ హనుమాన్ చౌదరి, దుర్గా పబ్లికేషన్స్ అధినేత దుర్గా గారు, పుస్తక రచయిత, ప్రముఖ పాత్రికేయులు ఎంవీఆర్ శాస్త్రి గారు తదితరులు పాల్గొన్నారు.
ముఖ్య అతిథిగా హాజరైన ఆర్.ఎస్.ఎస్ సర్ కార్యవాహ శ్రీ దత్తాత్రేయ హోసబలే మాట్లాడుతూ ‘‘నేతాజీ’’ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడం గర్వంగా ఉందన్నారు. ‘‘ముఖ్య అతిథిగా ఇక్కడ నిలబడినా, నిజానికి నేను అతిథిని కాదని, నేతాజీ జీవిత లక్ష్యంతో మమేకమైన కోట్లాది భారతీయులలో ఒకడినని, ఈ దేశ ప్రేమికుల సమూహంలో నేను కూడా ఉండడం ఎంతో గర్వంగా ఉంది’’ అని ఆయన అన్నారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ గురించి చెప్పాలంటే ఒళ్లు పులకరించిపోతుందని, నేతాజీ అనే పేరులోనే ఒక విద్యుత్ ప్రవహిస్తోందని అన్నారు. స్వాతంత్య్ర సమరయోధుడిగా, లోక ప్రియుడైన నాయకుడిగా, సేనాధితిగా, మన దేశ మొదటి ప్రధానిగా అన్నీ ఆయన సాధించిన పదవులే అని అన్నారు.
ఆజాద్ హిందూ ఫౌజ్ (ఐఎన్‌ఏ) స్థాపించి ఎంతో మంది సైనికులను తయారు చేసిన ఘనత వారిదే అని అన్నారు. విద్యార్థి దశలోనే టెరిటోరియల్ ఆర్మీలో పని చేయడం వల్ల ఆ నాయకత్వ లక్షణం అలవడిందని గుర్తు చేశారు. నేతాజీ చరిత్ర మాత్రమే కాదు, మన భవిష్యత్ భారత విధాన రూపకర్త అని అన్నారు. ఆయన సాహసం, మేధ అద్వితీయమని, కేవలం తన స్వశక్తితోనే అనేక పదవులను అలంకరించారని అన్నారు.
రెండవ ప్రపంచ యుద్ధంలో ఆయన దౌత్యనీతి ప్రస్ఫుటమైతుంది. ఆయన సామ్రాజ్య వాద శక్తులతో కలిశాడనే విమర్శలతో ఆయనపై ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడారు. కానీ ఆయన జపాన్‌తో చేసుకున్న ఒప్పందం గమనిస్తే ఆయన ఎంత జాగ్రత్తలు తీసుకున్నదీ తెలుస్తుందని అన్నారు.
భారతీయ సనాతన ధర్మం ఆధారంగా ఆయన ఆలోచనలు ఉండేవని, ఆయన అనుచరుడు సమర్‌గుహ చెప్పిన మాటల ప్రకారం.. ఎర్రకోటలో చూలాబాయ్ దేశాయ్ ఐఎన్‌ఏ తరుపు వాదించిన బారిష్టర్, ఆయన నేతాజీని తప్పుగా అనుకున్నానని వాపోయారు. ఐఎన్‌ఏ కోసం వారు వాదించారు. నేతాజీ యుద్ధ సన్యాసి. ఆయన ప్రతీ రోజు భగవద్గీతలో ఒక శ్లోకం చదువుకున్న తరువాతే నిద్రకు ఉపక్రమించే వారు. అదీ ఆయన ధర్మ నిష్ట.
చరిత్రను వక్రీకరించిన భారత విచ్ఛిన్నం చేయాలని ప్రయత్నించిన, ప్రయత్నిస్తున్న అనేక ఉన్మాద శక్తులను ఎదుర్కొని భారతీయ సనాతన సాంప్రదాయం సంస్కృతిని పరిరక్షించే మేధో క్షత్రియులు ఇప్పుడు అవసరమని, అందుకు ఇటువంటి పుస్తకాలు అనేకం రావాలని దత్తాత్రేయ హోసబలే ఆశాభావం వ్యక్తం చేశారు.