పత్తి రైతులకు నూతన సాంకేతికత అందుబాటులోకి… సందేహాల నివృత్తికి సాంకేతికత
తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో పత్తి ప్రధాన పంట. చాలా మంది రైతులు పత్తిపంటపై ఆధారపడుతుంటారు. దీనిని తెల్ల బంగారం అని కూడా పిలుచుకుంటారు. అలాంటి పత్తి రైతుల విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పత్తి విక్రయాల సమాచారం తెలుసుకునేందుకు వీలుగా మార్కెట్ అధికారులు సాంకేతికతను అందుబాటులోకి తెచ్చారు. పత్తి ఎక్కడ అమ్మాలి? ఎంత రేటు? డబ్బులు ఎప్పుడు బ్యాంకులో జమ అవుతాయి? అన్న సమాచారం కోసం రైతులు చాలా బాధలు పడేవారు. ఇప్పుడు వీటన్నింటినీ తెలుసుకునేందుకు సాంకేతికత వచ్చేసింది. వాట్సాప్ సేవలు అందుబాటులోకి వచ్చింది. రైతులు వాట్సాప్ నెంబరును నమోదు చేసుకొని, హాయ్ అన్న సందేశం పంపాలి. అలాగే ఆధార్ కార్డు నెంబరును నమోదు చేస్తే.. పత్తి రైతుకి ఏ సమాచారం కావాలో అది చెబుతుంది. ఇందు కోసం 8897281111 నెంబరుకి ఫోన్ చేయాలి.
ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఈ ప్రాజెక్టును వ్యవసాయ మార్కెట్ అధికారులు వేగిరంగా అమలు చేస్తున్నారు. ఈ సీజన్ లో 68 లక్షల క్వింటాళ్ల పత్తి మార్కెట్ కి వస్తుందని అంచనా వేస్తున్నారు. రైతుల సమస్యలను, సందేహాలను నివృత్తి చేసేందుకు వన్ సాఫ్ట్ వేర్ సిస్టం లిమిటెడ్ సంస్థ ఆధ్వర్యంలో ఈ వాట్సాప్ సేవలను అందుబాటులోకి తెచ్చారు. పత్తి విక్రయాలు, అర్హత, అమ్మకం వివరాలు, తక్ పట్టి, చెల్లింపుల స్థితి, కొనుగోలు వివరాలన్నీ ఈ నెంబరు ద్వారా తెలుసుకునే వీలుంటుంది రైతులకు. అయితే… ఆధార్ కార్డుతో అనుసంధానం వున్న ఫోన్ నెంబర్ తోనే ఈ వాట్సాప్ సేవలు అందుబాటులోకి వస్తాయి. ఈ వ్యవస్థను రైతులందరూ ఉపయోగించుకోవాలని ప్రభుత్వం పిలుపునిచ్చింది.