పర్యావరణం, సంస్కృతి పరస్పర పూరకాలు : భారతీయ సంస్కృతి ఉత్సవ్ లో వక్తలు
ప్రకృతి వుంటేనే సంస్కృతి వుంటుందని, లేదంటే సంస్కృతి అంతరించి పోతుందని పర్యావరణ వేత్తలు అన్నారు. పర్యావరణం దెబ్బతిన్న చోట మనుగడే ప్రశ్నార్థకం అవుతుందని, సంస్కృతి కూడా అంతరించిపోతుందని, దీనికి అనేక ఉదాహరణలు వున్నాయన్నారు. కర్నాటకలోని సేడంలో జరుగుతున్న భారతీయ సంస్కృతి ఉత్సవంలో పలువురు వక్తలు ప్రసంగించారు. మానవజాతిని కాపాడుకోవడతానికైనా పర్యావరణాన్ని రక్షించుకోవాలన్నారు. పర్యావరణ విధ్వంసానికి ప్లాస్టిక్కే ప్రధాన కారణమని విజయపుర ఎమ్మెల్యే బసవన గౌడ పాటిల్ అన్నారు. ప్లాస్టిక్ కారణంగా జలశయాలు, నదులు, సముద్రాలు అంతా కలుషితం అవుతున్నాయని, జీవజాతులు కూడా చనిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. హైందవ సంస్కృతిలో పంచ భూతాలను దేవతలుగా ఆరాధించే సంస్కృతి వుందని, అందుకే పర్యావరణాన్ని, సంస్కృతిని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.
కశ్మీరీ ఫైల్స్ ఫేమ్, నటి సుంబ్లీ మాట్లాడుతూ దేశంపై ఎన్నో దండయాత్రలు జరిగాయని, అయినా.. భారతీయ సంస్కృతిని ఏమీ చేయలేకపోయారన్నారు. కానీ ఈ మధ్య ప్రకృతి విధ్వంసం విపరీతంగా పెరిగిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. పర్యావరణం, సంస్కృతిని రక్షించుకోవడానికి అందరూ ముందుకు రావాలన్నారు.
జమ్మూ కశ్మీర్ స్టడీ సర్కిల్ అధ్యక్షుడు శక్తి మున్షీ మాట్లాడుతూ జమ్మూ కశ్మీర్ లోని దాల్ సరస్సుతో సహా పలు నదులు మురుగు నీటి కాలుష్యం, వ్యర్థాలతో నిండిపోయాయన్నారు. కశ్మీర్ భూతల స్వర్గంగా పిలుచుకుంటామని, కానీ కొన్ని తప్పులు జరుగుతున్నాయన్నారు. పర్యావరణానికి హాని కలుగుతోందన్నారు. పర్యావరణ సమతౌల్యంతో చాలా మంది ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్నారన్నారు. పర్యావరణ పరిరక్షణ విషయంలో ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలన్నారు.