పహల్గాంలో తిరిగి తెరుచుకున్న పర్యాటక ప్రదేశాలు

జమ్మూకశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రదాడి జరిగిన 2 నెలల తర్వాత భద్రతా కారణాల దృష్ట్యా మూసివున్న పర్యాటక ప్రాంతాలు దశలవారీగా తెరుచుకోనున్నాయి. ఈ నేపథ్యంలో పహల్గాంతో సహా చుట్టు పక్కల ప్రాంతాలకు పర్యాటకుల తాకిడి పెరిగింది. సెల్ఫీలు దిగుతూ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్నారు. పర్యాటకుల రద్దీతో పలు చోట్ల వాహనాల రద్దీ ఏర్పడింది.

పర్యాటకుల తాకిడితో జమ్మూ-కశ్మీర్‌ అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. పహల్గాం లోయలోని పలుచోట్ల భద్రతా దళాలను మోహరించారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత జమ్మూకశ్మీర్‌లోని పర్యాటక ప్రాంతాలపై తీవ్ర ప్రభావం పడింది. ఈ నేపథ్యంలోనే భద్రతా కారణాల దృష్ట్యా కొన్ని పర్యాటక ప్రాంతాలను అధికారులు మూసివేశారు.  అయితే మూసివున్న తోటలు, పార్కులు, పర్యాటక ప్రాంతాలన్నీ తిరిగి తెరచుకోనున్నట్లు జమ్మూ-కశ్మీర్‌ లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా ఇటీవల ప్రకటించారు.

“ముందు జాగ్రత్త చర్యగా తాత్కాలికంగా మూసివేసిన కాశ్మీర్ & జమ్మూ డివిజన్లలోని కొన్ని పర్యాటక ప్రదేశాలను తిరిగి తెరవాలని నేను ఆదేశించాను. పహల్గామ్ మార్కెట్, వెరినాగ్ గార్డెన్, కోకర్నాగ్ గార్డెన్, అచాబల్ గార్డెన్‌లోని బేతాబ్ వ్యాలీ, పార్కులను జూన్ 17 నుండి తిరిగి తెరవనున్నారు” అని మనోజ్ సిన్హా ఎక్స్ లో ఒక పోస్ట్‌లో తెలిపారు. ముఖ్యంగా పహల్గామ్ మార్కెట్, వెరినాగ్ గార్డెన్, కోకర్నాగ్ గార్డెన్, అచాబల్ గార్డెన్, బేతాబ్ వ్యాలీ పార్కులు ఈనెల 17 నుంచి తెరుచుకుంటాయని వెల్లడించారు. ఈ నిర్ణయంతో పహల్గాంలో పర్యాటకుల తాకిడి పెరిగింది. దాదాపు 2నెలల తర్వాత పహల్గాం సహా చుట్టుపక్కల ప్రాంతాలు పర్యాటకులతో కళకళలాడుతున్నాయి. సెల్ఫీలు దిగుతూ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్నారు. కుటుంబాలతో కలిసి నది ఒడ్డున సేదతీరుతున్నారు. పర్యాటకుల రద్దీతో పహల్గాంలోని పలుచోట్ల ట్రాఫిక్‌ ఏర్పడింది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *