పాకిస్థాన్ ఏకైక లక్ష్యం భారత్‌తో శత్రుత్వం : ప్రధాని మోదీ
దేశ విభజన తర్వాత ఏర్పడిన పాకిస్థాన్ భారత్‌తో శత్రుత్వమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు ఆరోపించారు. గుజరాత్ పర్యటనలో భాగంగా దోహద్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న ప్రధాని మోదీ పాకిస్థాన్‌పై విరుచుకుపడ్డారు.“విభజన తర్వాత ఏర్పడిన పాకిస్థాన్ ఏకైక లక్ష్యం భారత్‌తో శత్రుత్వం. భారత్ అంటే ద్వేషంతో మన దేశానికి హాని కలిగించాలనే తపనే ఉంటుంది. కానీ, భారత్ లక్ష్యం పేదరికాన్ని నిర్మూలించటం. ఆర్థికవ్యవస్థను బలోపేతం చేయటం. అభివృద్ధి చెందటం. దేశ సైన్యం బలంగా ఉన్నప్పుడే వికసిత్ భారత్ సాధ్యమవుతుంది. అప్పుడు మన ఆర్థికవ్యవస్థ బలంగా ఉంటుంది” అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
అంతేకాకుండా 2014లో ఇదే తేదీన ప్రధానిగా ప్రమాణస్వీకారం చేశారని గుర్తు చేసుకున్నారు. దోహద్‌లో దాదాపు రూ.24వేల కోట్ల విలువైన అనేక అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. రైల్వే లోకోమొటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్‌తోపాటు 9వేల హార్స్‌పవర్ సామర్థ్యం కలిగిన దేశంలోనే తొలి లోకోమొటివ్ ఇంజిన్‌ను ప్రారంభించారు. రెండు రోజుల గుజరాత్ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ దోహద్, భుజ్, గాంధీనగర్‌లో జరిగే పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. దాదాపు రూ.83వేల కోట్లతో చేపట్టే వేర్వేరు అభివృద్ధి పనులకు భూమిపూజ, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.
దాహోద్‌లో లోకోమోటివ్ తయారీ కేంద్రాన్ని ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ భారతదేశ ప్రజలు ఆదాయం సంపాదించి ముందుకు సాగాలంటే, ప్రతి భారతీయుడూ ఇక్కడి వస్తువులే వినియోగిస్తామని ప్రతిజ్ఞ చేయాలన్నారు. మన దేశంలో తయారైన ఉత్పత్తులు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందుతున్న వేళ, మనం దేశీయ ఉత్పత్తులను ఎందుకు ఉపయోగించకూడదని ప్రశ్నించారు.
ఆపరేషన్ సిందూర్ కేవలం ఒక సైనిక చర్య కాదని, ఇది మన భారతీయ విలువలు, భావాల వ్యక్తీకరణ అని మోదీ పేర్కొన్నారు. ఈ క్రమంలో ఉగ్రవాదాన్ని ఆశ్రయిస్తున్న వారు మోదీని ఎదుర్కొవడం ఎంత కష్టమో కలలో కూడా ఊహించలేరని మోదీ చెప్పారు. భారతదేశ చరిత్రలో తొలిసారిగా గిరిజన గ్రామాల అభివృద్ధికి సాధికారత కల్పించడానికి అనేక కొత్త పథకాలను ప్రారంభించామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుర్తు చేశారు. గిరిజన నేత బిర్సా ముండా గౌరవార్థం గిరిజన గ్రామ ఉదయ్ అభియాన్’ను ప్రారంభించినట్లు తెలిపారు.
దాహోద్ లో ప్రారంభించిన ప్లాంట్‌లో 9,000 హార్స్‌పవర్ (HP) విద్యుత్ లోకోమోటివ్స్ తయారు చేయబడతాయి. ఇవి 4,500 టన్నుల బరువును 120 కిలోమీటర్ల వేగంతో తీసుకెళ్లగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఈ ప్లాంట్‌లో తయారు చేయబడిన లోకోమోటివ్స్ భారతదేశంలోనే అత్యంత శక్తివంతమైనవి కానున్నాయి. అలాగే, ఈ లోకోమోటివ్స్‌ను విదేశాలకు ఎగుమతి చేసే లక్ష్యంతో తయారు చేయనున్నారు. తద్వారా ఇది “మేక్ ఫర్ వరల్డ్” కార్యక్రమానికి తోడ్పాటునివ్వనుంది.