పాక్ ఈసారి ఎన్ని ముక్కలవుతుందో దేవుడికే తెలియాలి : రాజ్ నాథ్ వార్నింగ్
భారత దేశ రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పాకిస్తాన్ కి గట్టి వార్నింగ్ ఇచ్చారు. బెంగాల్ పై కన్నేస్తే ఈ సారి పాకిస్తాన్ ఎన్ని ముక్కలు అవుతుందో ఆ దేవుడికే తెలియాలంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కలకత్తాను లక్ష్యంగా చేసుకొని దాడులకు దిగుతామని పాక్ రక్షణ మంత్రి ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఓ జాతీయ వార్తా ఛానెల్ తో మాట్లాడుతూ రాజ్ నాథ్ సింగ్ ఈ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యల వల్లే 55 సంవత్సరాల క్రితం పాక్ రెండుగా విడిపోయిన విషయాన్ని గుర్తు చేశారు. 1971 లో జరిగిన యుద్ధంలో పాక్ నుంచి విడిపోయి బంగ్లాదేశ్ స్వతంత్ర దేశంగా ఏర్పడిందని, నాడు బంగ్లాదేశ్ విముక్తి పోరాటానికి భారత సైన్యం అండగా నిలించిందన్నారు. ఉద్రిక్తతలను పెంచే ప్రకటనలు చేయవద్దని హితవు పలికారు.
పాక్ రక్షణ మంత్రి ఖవాజా కొన్ని రోజుల క్రితం ప్రగల్భాలకు దిగారు. రాబోయే యుద్ధంలో తాము కేవలం సరిహద్దులకే పరిమితం కాకుండా ఏకంగా కలకత్తాను లక్ష్యంగా చేసుకుంటామంటూ పేర్కొన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా భారత్ పై బూటకపు ఆరోపణలు చేస్తూ అంతర్జాతీయ స్థాయిలో ఇలాంటి ఉద్రిక్తతలకు తెర తీస్తున్నారు. ఆపరేషన్ సిందూర్ లో చావుదెబ్బ తిన్న పాకిస్తాన్ తన ప్రగల్భాలను మాత్రం ఆపడం లేదు. ఆర్థిక వ్యవస్థ అస్సలే బాగోలేదు. ప్రస్తుతం యుద్ధ వాతావరణం నేపథ్యంలో ప్రతి రోజూ రాత్రి 8 గంటల కల్లా అన్ని దుకాణాలు, మార్కెట్లను మూసేస్తున్నారు. దీంతో ఆర్థిక వ్యవస్థ ఇబ్బందులు పడుతోంది. మరో వైపు ప్రపంచ దేశాలు కూడా పాక్ ను నమ్మే పరిస్థితిలో లేవు. అయినా సరే పాకిస్తాన్ తన ఉత్తర ప్రగల్భాలను మాత్రం ఆపడం లేదు.