పాక్, బంగ్లా పౌరులకు సీఏఏ కింద భారత పౌరసత్వం జారీ చేసిన మధ్యప్రదేశ్ సర్కార్
పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి భారత్‌కి వచ్చిన ముగ్గురు పౌరులకు సీఏఏ కింద భారత పౌరసత్వం లభించింది. ఈ ముగ్గురికి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి చేతుల మీదుగా భారత పౌరసత్వం లభించింది. సీఏఏ కింద తమకు భారత పౌరసత్వం కావాలని మొదట దరఖాస్తు చేసుకున్నది కూడా ఈ ముగ్గురే. వీరిలో ఇద్దరు పాకిస్తాన్‌కి చెందినవారు. సమీర్ మెల్వానీ, సంజన మెల్వానీ కాగా, బంగ్లా నుంచి రాఖీదాస్ వున్నారు. ఈ ముగ్గురికి కూడా ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ పౌరసత్వ ధ్రువీకరణ పత్రాలిచ్చారు. ఈ ముగ్గుర్నీ తాము స్వాగతిస్తున్నామని, తమ రాష్ట్రానికి వచ్చే ఇతర పౌరులను కూడా స్వాగతిస్తామని సీఎం ప్రకటించారు. ఈ ముగ్గురు భారత పౌరసత్వం తీసుకోవడం తమకెంతో సంతోషంగా వుందని, తమ ప్రభుత్వం అందించే సకల సౌకర్యాలకీ వీరు అర్హులని ఆయన ప్రకటించారు.
మరోవైపు తమకు భారత పౌరసత్వం లభించడం ఆనందంగా వుందని బంగ్లా నుంచి వచ్చిన రాఖీదాస్ ప్రకటించారు. ఇది అత్యంత సంతోషకరమైన అంశమని పేర్కొన్నారు. పీహెచ్‌డీ చేయడానికి తాను బంగ్లా నుంచి ఇక్కడికి వచ్చానని, ఇక ఇక్కడే పూర్తి చేస్తానని ప్రకటించారు.