పాలనలో ఉర్దూ, పర్షియన్ పదాలకు స్వస్తి.. రాజస్థాన్ సర్కార్ నిర్ణయం
రాజస్థాన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకూ మొఘలులకు సంబంధించిన ఉర్దూ, పర్షియన్ పదాలనే ఉపయోగించేది. పోలీసు శాఖతో పాటు ఇతర విభాగాలలలో కూడా ఇవే పదాలను ఉపయోగిస్తున్నారు. దీని నుంచి బయటపడాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక నుంచి మొఘల్ కాలానికి సంబంధించిన పదాలేవీ ప్రభుత్వ విభాగాలలో ఉపయోగించరు. రాష్ట ప్రభుత్వం ఈ మేరకు ఇప్పటికే పోలీసు శాఖతో పాటు ఇతర శాఖలకు స్పష్టమైన ఆదేశాలిచ్చింది. మరీ ముఖ్యంగా పోలీసు శాఖపైనే ఎక్కువ దృష్టి పెట్టారు. దీనిలో భాగంగా అధికారిక పత్రాలు, పోలీసు రికార్డుల్లో వున్న ఉర్దూ, పర్షియన్ పదాలకు స్వస్తి పలకాలని మంత్రి డీజీపీకి ఆదేశాలిచ్చారు. వాటి స్థానే హిందీ, ఇంగ్లీషు పదాలనే వాడాలని మంత్రి జవహర్ సింగ్ బేదామ్ సూచించారు.
ప్రభుత్వం చేస్తున్న పనులను మరింత పారదర్శకంగా, ప్రజలకు అర్థమయ్యే విధంగా చేయడమే దీని లక్ష్యమని వివరించారు. ఉర్దూ, పర్షియన్ పదాలు సామాన్యులకు అర్థమే కావడం లేదని, తాము ఏం చేస్తున్నామో అర్థం కాకుండా పోతోందని ప్రభుత్వం చెబుతోంది. అంతేకాకుండా పరిపాలనా యంత్రాంగంలో కూడా గందరగోళాన్ని నెలకోల్పుతోంది. హిందీ, ఆంగ్ల పదాలను విరివిగా వాడితే, ప్రజలు కూడా అర్థం చేసుకుంటారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
ఈ నిర్ణయం తక్షణమే అమలు చేయాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే హిందీ, ఆంగ్ల పదాల జాబితాను కూడా సిద్ధం చేయిస్తోంది. దీని ద్వారా పరిపాలనలో ఏకరూపత సాధ్యం అవుతుందని, ప్రజలకు అడ్డంకిగా వున్న భాషను కూడా మార్చినట్లవుతుందని అధికారులు తెలిపారు.ఈ నిర్ణయం రాజస్థాన్‌లో భాషా సంస్కరణకు ఒక పెద్ద అడుగుగా పరిగణించబడుతోంది.