పీఎఫ్ డబ్బులతో అమ్మాయిలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించిన వైద్యుడు
రాజస్థాన్ లోని ఆర్పీ యాదవ్ అనే వైద్యుడు అమ్మాయిలకు సహాయ సహకారం అందించి, తన ఉదారతను చాటుకున్నారు. ఉద్యోగం నుంచి పదవీ విరమణ పొందిన తర్వాత పీఎఫ్ డబ్బులోంచి కొంత డబ్బును తీసి, అమ్మాయిలు కాలేజీకి వెళ్లడానికి ఉచిత బస్సును ఏర్పాటు చేశారు.రామేశ్వర్ ప్రసాద్ యాదవ్ స్వస్థలం రాజస్థాన్ లోని జైపూర్ జిల్లాలోని కొట్ పుట్లీ గ్రామం. 6 నెలల క్రితమే తన కుమార్తె మరణించింది. ఈ విషాదం ఆ వైద్యుడ్ని తీవ్రంగా కుంగిపోయేలా చేసింది.
ఇలాంటి పరిస్థితుల్లో అమ్మాయిలకు ఏదైనా చేయాలని గట్టిగ సంకల్పం తీసుకున్నారు. తన పీఎఫ్ ఖాతా నుంచి 19 లక్షలు డ్రా చేశారు. అమ్మాయిల కోసం బస్సును కొనుగోలు చేసి, అందులో వారికి ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించారు. ఆ బస్సులో సమీపంలోని అనేక గ్రామాల నుంచి 70 నుంచి 80 మంది అమ్మాయిలు ఎలాంటి బస్సు ఛార్జీలు లేకుండానే కళాశాలలకు వెళ్తున్నారు. అలాగే బస్సు డ్రైవర్ కి నెలకు 48 వేల రూపాయల జీతం కూడా ఇస్తారు. అలాగే బస్సు నిర్వాహణ ఖర్చు కూడా ఆ వైద్యుడే చూసుకుంటున్నారు.
ఆ గ్రామానికి అస్సలు రవాణా సౌకర్యం లేదు. దీంతో చుట్టు పక్కల గ్రామాలకు చెందిన అమ్మాయిలకు రవాణా సౌకర్యం చాలా ఇబ్బందిగా మారింది. ఈ విషయాన్ని వైద్యుడు ఆర్పీ యాదవ్ గ్రహించారు. దీంతో ప్రతి రోజూ బస్సులో ఎక్కే అమ్మాయిలకు పూజలు చేసి మరీ, వారందర్నీ బస్సులో క్షేమంగా కూర్చోబెడతారు. వారికి కాలేజీకి పంపిస్తారు.
ఈ సందర్భంగా వైద్యుడు ఆర్పీ యాదవ్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఓ రోజు తన భార్యతో కలిసి కారులో ప్రయాణం చేస్తున్నామని, విపరీతమైన వర్షం కురుస్తోందన్నారు. దారిల నలుగురు విద్యార్థినులు జోరు వానలో కాలినడకన కాలేజీకి వెళ్లడం చూశామన్నారు. వెంటనే కారు ఆపి, వారిని అడగ్గా తమకు రవాణా సౌకర్యమే లేదని, అందువల్ల 10 కిలోమీటర్ల దూరంలో వున్న కాలేజీకి నడుచుకుంటూ వెళ్తున్నట్లు తెలిపారన్నారు. దీంతో వెంటనే తమ డబ్బులతో బస్సు సౌకర్యం కల్పించాని నిర్ణయించి, బస్సు నడుపుతున్నామని పేర్కొన్నారు.