పూరీలో రెండో విడత సర్వేను ప్రారంభించిన పురావస్తు శాఖ
ఒడిశాలోని ప్రసిద్ధ పూరీ జగన్నాథ ఆలయంలోని రత్న భాండాగారాన్ని అధికారులు మరోసారి తెరిచారు. ఇందులో భాగంగా రెండో విడత సర్వేను భారత పురావస్తు శాఖ ప్రారంభించింది. ఈ సర్వే నేపథ్యంలో మూడు రోజుల పాటు మధ్యాహ్నం 1 నుంచి సాయంత్రం 6 గంటల వరకూ తోబుట్టువుల దేవతల దర్శనాన్ని నిషేధించారు. మరోవైపు ఆలయ రత్న భాండాగారంలో ఏదైనా రహస్య ఛాంబర్ లేదా సొరంగం వుందా? అన్న అంశాన్ని కూడా భారత పురావస్తు శాఖ తేల్చేయనుంది.
ఇప్పటికే తొలివిడత సర్వేను అధికరులు నిర్వహించారు. ఈ సర్వేకి భక్తులందరూ సహకరించాలని అధికారులు సూచించారు. ఈ మూడు రోజుల పాటు సర్వే కారణంగా పూరీ ఆలయం ప్రధాన ద్వారాలను మూసేయనున్నారు. ఈ సర్వే కోసం అత్యాధునిక రాడార్ ను వినియోగిస్తున్నారు. సెప్టెంబర్ 18 న తొలి సర్వే నిర్వహించారు. అందులో 17 మంది సభ్యులున్నారు. మరోవైపు అక్కడున్న రత్నాలను నాగ దేవతలు రక్షిస్తుంటారని కూడా అందరూ నమ్ముతారు. అందుకే రత్న భాండాగారం తెరవక మునుపే భువనేశ్ర్ నుంచి పాములు పట్టడంలో నిష్ణాతులైన వారిని తీసుకొచ్చారు. అలాగే వైద్యుల బృందాన్ని కూడా అందుబాటులో వుంచారు.