ప్రకృతి హితమే తన అభిమతం…తన ఊరినే మార్చేసిన ఓ యువకుడు
పర్యావరణ హితమే తన కెరీర్‌గా మలుచుకున్నాడు ఈ యువకుడు. వివిధ రకాల చెట్లను తన ఊళ్లోని యువకులందర్నీ ఓ బృందంగా తయారు చేసి, చెట్లను కూడా నాటుతున్నాడు. దాదాపు 70,000 చెట్లను ఇప్పటి వరకు నాటి, పర్యావరణ హితానికి ఇతోధికంగా పాటుపడుతున్నాడు. ఉత్తరాఖండ్ నైనితాల్ జిల్లా టోక్ చామా గ్రామానికి చెందిన ఈ వ్యక్తి పేరు చందన్ సింగ్ నయాల్. చదివింది ఇంజినీరింగ్ డిప్లోమా. కానీ ఊరి బాగుకోసం, పర్యావరణ హితం కోసం మధ్యలోనే తన ఉద్యోగాన్ని ఆపేశారు. 10 సంవత్సరాల్లోనే 65 వేలకు పైగానే చెట్లను నాటారు. అంతే కాకుండా చెట్ల కోసం ప్రత్యేకంగా నయాల్… ఓ నర్సరీని కూడా పెంచుతున్నారు. ఈ నర్సరీ మాధ్యమంగానే మిత్ర బృందంతో కలిసి చెట్లను పంచడంతో పాటు, పెంచడం కూడా ప్రారంభించారు. దీంతో దగ్గర్లో వున్న అడువులకు, చెట్లకు ప్రాణం పోస్తున్నాడు.
అంతేకాకుండా తన ధ్యేయం మధ్యలోనే ఆగిపోవద్దని, తన గ్రామంలోని మహిళలను కూడా కలుపుకొని ముందుకు సాగుతున్నారు. ప్రజలను తాను చైతన్యం చేస్తూనే, మహిళలతో కూడా ఈ పనిని చేయిస్తున్నాడు. ఈయన లక్ష్యం చూసి, మహిళలు కూడా తమ వంతు పాత్రను పోషిస్తున్నారు. దీంతో అక్కడ ఓ చిన్నపాటి అడవినే సృష్టించాడు. ఇలా దాదాపు 4 ఎకరాల కృత్రిమ అడవినే సృష్టించేశాడు. ఇక్కడి నుంచే చెట్లను పంపిణీ చేస్తున్నాడు. అయితే ఇంత చేస్తున్నా… ఎక్కడా కూడా ప్రభుత్వ సహాయం మాత్రం తీసుకోవడం లేదు. కేవలం చెట్లను పెంచడం మాత్రమే కాకుండా వాటి పూర్తి సంరక్షణ బాధ్యత కూడా తీసుకుంటున్నాడు.అంతేకాకుండా నీటి డ్యామ్ లను కూడా నిర్మిస్తున్నాడు. చెట్లకు, నీటికి మధ్య వున్న సంబంధాన్ని కూడా వివరిస్తున్నాడు. వేసవి సమయంలో తన గ్రామానికి నీటి ఎద్దడి రాకుండా వుండడానికి 6 వేల చెక్ డ్యామ్ లను కూడా నిర్మించి, వాన నీటిని సంరక్షిస్తున్నాడు.
‘‘ఎలక్ట్రానిక్స్ రంగంలో నేను డిప్లొమా పూర్తి చేశాను. మొదట్లో పర్యావరణ బాగుండే ప్రాంతాల్లో తిరగడం బాగా అలవాటుగా మారింది. కానీ… ఆ తర్వాత లెక్చరర్ గా జీవితం ప్రారంభించాను. ఏ పని చేస్తున్నా… ప్రకృతి వైపు నా మనసు లాగేది. ప్రకృతి బాగా ధ్వంసమవుతోందని నా చిన్నతనం నుంచే చూస్తున్నాను. చాలా బాధపడేవాడ్ని. అడవులకు నిప్పు అంటుకుంటే… గ్రామస్థులతో కలిసి, వాటిని ఆర్పడానికి వెళ్లడం కూడా నాకు గుర్తు. ఇలా మంటలు అంటుకుంటుంటే జీవ విధ్వంసం జరుగుతుందని నా భయం. అయితే కొన్ని రోజుల తర్వాత మా అమ్మ చనిపోయింది. దీంతో నా మనస్సు బాగా బాధపడేది. ఒంటరిగా ఫీల్ అయ్యేవాడిని. ఏం చేయాలో తోచకపోయేది. దీంతో ఒంటరిగా ప్రకృతితో గడిపేవాడిని. అడవుల్లో తిరిగేవాడిని. చెరువులు, కుంటల దగ్గర గడిపేవాడ్ని. దీంతో నాకు కొంత ఉపశమనం లభించేది. మా అమ్మ మరణం తర్వాతే ప్రకృతికి బాగా దగ్గరయ్యాను. నా లక్ష్యం చేరుకోవడానికి ఈ సంఘటన బాగా ఉపకరించింది’’ అని పేర్కొన్నాడు.
ఇక… స్థానిక మహిళలు తమకు అవసరమైన వంట చెరుకు కోసం రోజూ చాలా దూరం వెళ్లాల్సి వచ్చింది. దీనిని కూడా చందన్ చాలా సీరియస్‌గా తీసుకున్నాడు. వెంటనే గ్రామ శివార్లలో ఓక్ చెట్లను కూడా పెంచడం మొదలు పెట్టారు. దాదాపు 11 సంవత్సరాలుగా ఇలా చేస్తున్నాడు. అంతేకాకుండా ఇంటింటికీ తిరుగుతూ పర్యావరణ అవసరం గురించి ప్రచారం కూడా చేస్తున్నాడు. వివిధ రకాల ఫంక్షన్లకు వెళ్లినా… పర్యావరణం గురించే చెప్పడం ప్రారంభించారు. దీంతో అందరిలోనూ కాస్త పర్యావరణంపై ప్రేమ పెరిగింది. చెట్లు పెంచడం, చెక్ డ్యామ్ లు నిర్మించడానికి చాలా సార్లు తన సొంత డబ్బే వాడేవాడు. ఎప్పుడైనా సరిపడని పక్షంలో అటవీ శాఖ నుంచి సాయాన్ని కోరేవాడు. గత కొన్ని సంవత్సరాలుగా చందన్ సింగ్ నయాల్ చేస్తున్న పనిని అటవీ శాఖ ఉన్నతాధికారులు బాగా గమనించారు. ఆయన సిన్సియారిటీకి మెచ్చుకొని, సహాయం చేసేవారు.
కోవిడ్ సమయంలోనే నయాల్ బాగా పనిచేసేవాడు. ఈ సమయంలోనే ప్రకృతిపై మరింత చైతన్యాన్ని పెంచాడు. దీంతో ఇతర గ్రామాలకు వెళ్లిన వారు కూడా తిరిగి గ్రామాలకు వచ్చిన సమయంలో వ్యవసాయంపై శ్రద్ధ పెంచుకున్నారు. నయాల్ చెప్పినట్లుగా పనిచేస్తూ, చెక్ డ్యామ్‌లు నిర్మించడానికి బాగా ఉపయోగపడేవారు. కోవిడ్ సమయంలో గ్రామస్థులు బాగా పనిచేయడంతో చెక్ డ్యామ్ ల నిర్మాణం కూడా సాధ్యమైంది. నయాల్ పనితనాన్ని ఉత్తరాఖండ్ ప్రభుత్వం గుర్తించింది. రెండు సంవత్సరాల క్రితమే కేంద్ర ప్రభుత్వం ‘వాటర్ హీరో’ అన్న అవార్డును బహూకరించింది.