ప్రజా స్థలాల్లో నమాజ్ చేసే హక్కు లేదు : అలహాబాద్ హైకోర్టు

ప్రభుత్వ భూమిని ఏ వ్యక్తి గానీ, సమూహం గానీ నమాజ్ చేయడానికి, మతపరమైన కార్యకలాపాల కోసం వినియోగించవద్దని అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. ఇలాంటివి ప్రజా శాంతికి, ఇతరుల హక్కులకు కూడా లోబడి వుంటుందని హైకోర్టు పేర్కొంది. సంభల్ జిల్లాలోని గున్నౌర్ నివాసి అయిన అసిన్, నివాస స్థలంలో సామూహిక ప్రార్థనలు నిర్వహించుకోవడానికి అనుమతిని కోరారు. అందుకు ఆధారంగా ఓ పత్రాన్ని కూడా ఉదహరించారు. ఆ స్థలం తన పేరు మీదకు బదిలీ అయ్యింది కాబట్టి, అక్కడ మతపరమైన సమావేశాలను నిర్వహించుకునే హక్కు తనకు వుందని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు.అయితే, హైకోర్టు ఈ వాదనను తిరస్కరించింది.
సమాజంలోని ప్రతి వర్గానికి, ప్రతి వ్యక్తికీ ప్రభుత్వ భూమిపై సమాన హక్కు ఉంటుందని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఎవరైనా సరే, ప్రభుత్వ భూమిని అక్రమంగా బదిలీ చేసి, అక్కడ జన సమూహాన్ని పోగుచేసి నమాజ్ చేయడానికి పట్టుబడితే, అలాంటి అమ్మకం లేదా బదిలీ పత్రం చట్టపరంగా చెల్లదని కోర్టు పేర్కొంది.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ అధికారాలను కూడా ఈ సందర్భంగా స్పష్టం చేసి, సంప్రదాయాలకు విరుద్ధంగా ఏదైనా కొత్త పని చేపట్టినట్లయితే, శాంతిభద్రతలను రక్షించడానికి ప్రభుత్వం అందులో జోక్యం చేసుకునే పూర్తి అధికారం వుంటుందని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ తీర్పుతో, డివిజన్ బెంచ్ న్యాయమూర్తి శ్రీధరన్ గతంలో వెలువరించిన తీర్పును కూడా రద్దు చేసింది. శాంతిభద్రతలు మరియు ప్రజా సుస్థిరత దృక్కోణం నుండి చూస్తే, గతంలో తీసుకున్న ఆ నిర్ణయం సమర్థనీయం కాదని ప్రస్తుత బెంచ్ స్పష్టం చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *