ప్రతి క్షణమూ ఆస్వాదిస్తున్నా : శుభాంశు శుక్లా మొదటి మెసేజ్

భారత వైమానిక దళానికి చెందిన గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా ‘‘ఆక్సియమ్ మిషన్ 4 లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి ఎగసిన కొన్ని గంటల తర్వాత కక్ష్య నుంచి తన తొలి వ్యక్తిగత సందేశాన్ని పంపారు. ఈ సందర్భంగా అంతరిక్షంలో తన అనుభవాన్ని పంచుకున్నారు.
shuklla34
‘‘అంతరిక్షం నుంచి అందరికీ నమస్కారం. తోటి వ్యోమగాములతో ఇక్కడ వుండటం చాలా ఆనందంగా అనిపిస్తోంది. చాలా ఆనందంగా వుంది. ఇప్పుడు మేం భూ కక్ష్యలో సెకనుకు 7.5 కిలోమీటర్ల వేగంతో తిరుగుతున్నాం. అద్భుతమైన ప్రయాణం. లాంచ్ ప్యాడ్ లోని క్యాప్సూల్ లో ఇప్పుడిప్పుడే నడక నేర్చిన చిన్నారిలా ప్రతీక్షణం ఆస్వాదిస్తున్నా. ఎలా కదలాలో, తినాలో, నన్ను నేను ఎలా నియంత్రించుకోవాలో తెలుసుకుంటున్నా.భారత త్రివర్ణ పతాకం చూడగానే ఈ ప్రయాణంలో నాతో పాటు మీరందరూ వున్నారని గుర్తుకు వచ్చింది. ఇది కేవలం నా అంతరిక్ష ప్రయాణం మాత్రమే కాదు. ఈ ప్రయాణంలో మీరంతా భాగస్వాములు అవ్వాలని కోరుకుంటున్నా.మన దేశ మానవ సహిత అంతరిక్ష కార్యక్రమాన్ని మనమంతా కలిసి ప్రారంభిద్దాం’’ అని శుభాంశు మెసేజ్ పంపారు.
ఫ్లోరిడాలోని నాసా కెన్నెడీ స్పేస్ సెంటర్ లో బుధవారం మధ్యాహ్నం 12.01 గంటలకు చేపట్టిన ఫాల్కన్ 9 రాకెట్ విజయవంతంగా అంతరిక్షంలోకి వెళ్లింది.శుభాంశు శుక్లా బృందం 14 రోజుల పాటు అంతరిక్ష కేంద్రంలో పరిశోధనలు చేయనుంది.
ఈ చారిత్రక యాక్సియమ్-4 మిషన్ ద్వారా భారత్, పోలాండ్, హంగేరీ దేశాలు 40 ఏళ్లకు పైగా విరామం తర్వాత మానవసహిత అంతరిక్ష యాత్రలను పునఃప్రారంభించాయి. ఈ మూడు దేశాలు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఒకేసారి మిషన్ నిర్వహించడం ఇదే తొలిసారి కావడం విశేషం. శుభాంశు శుక్లా తన 14 రోజుల అంతరిక్ష పర్యటనలో పలు కీలకమైన శాస్త్రీయ ప్రయోగాలు చేపట్టనున్నారు. ముఖ్యంగా ఇస్రో-డీబీటీ స్పేస్ న్యూట్రిషన్ ప్రోగ్రామ్ కింద మెంతి, పెసర వంటి భారతీయ ఆహార ధాన్యాల విత్తనాలు సూక్ష్మ గురుత్వాకర్షణలో ఎలా మొలకెత్తుతాయో అధ్యయనం చేస్తారు. ఈ విత్తనాలను తిరిగి భూమికి తీసుకొచ్చి, వాటి మనుగడ సామర్థ్యాన్ని పరిశీలిస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *