ప్రధాని మోదీకి అత్యున్నత పురస్కారాన్ని ప్రదానం చేసిన ’’ఘనా’’ ప్రభుత్వం
ప్రధాని నరేంద్ర మోదీకి మరో అరుదైన గౌరవం దక్కింది. పశ్చిమ ఆఫ్రికా దేశం ఘనా అత్యున్నత పురస్కారాన్ని ప్రదానం చేసింది. ‘ది ఆఫీసర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ఘనా’ అవార్డుతో ఘనా ప్రభుత్వం ఘనంగా సత్కరించింది.
ప్రధాని మోదీ ఈ గౌరవాన్ని భారత పౌరులకు అంకితం చేశారు. ఈ గౌరవానికి ఘనాకు కృతజ్ఞతలు తెలిపారు. ‘ఘనా అత్యున్నత పురస్కారం దక్కడం చాలా గర్వకారణం, గౌరవం. అధ్యక్షుడు మహామా, ఘనా ప్రభుత్వం, ఘనా ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. 1.4 బిలియన్ల భారతీయుల తరపున నేను ఈ గౌరవాన్ని వినయంగా అంగీకరిస్తున్నాను. ఈ అవార్డును మన యువత ఆకాంక్షలకు, వారి ఉజ్వల భవిష్యత్తుకు, మన గొప్ప సాంస్కృతిక వైవిధ్యం, సంప్రదాయాలకు, భారతదేశం, ఘనా మధ్య చారిత్రక సంబంధాలకు అంకితం చేస్తున్నాను’ అని అన్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. ఘనాలో రెండ్రోజుల అధికారిక పర్యటన కోసం జులై 2న రాజధాని అక్రాకి వెళ్లారు. గత 30 సంవత్సరాలలో భారత ప్రధానమంత్రి ఎవరూ ఘనాకి వెళ్లలేదు. ఇప్పుడే ఆ సందర్భం వచ్చింది. ఇది భారత్-ఘనా సంబంధాలలో ఒక మైలురాయిగా నిలుస్తోంది. ఘనా అధ్యక్షుడు జాన్ డ్రామని మహామా స్వయంగా విమానాశ్రయంలో మోదీకి ఘన స్వాగతం పలికారు, 21 గన్ సెల్యూట్, గౌరవ వందనంతో ఆతిథ్యం ఇచ్చారు.ఈ పర్యటనలో స్థానిక భారతీయులు, అక్రాలోని ఒక హోటల్ దగ్గర ‘భారత్ మాతా కీ జై’, ‘హరే రామ, హరే కృష్ణ’ నినాదాలతో మోదీని ఉత్సాహంగా స్వాగతించారు.