ప్రయాగ్ రాజ్ లో ‘‘స్వచ్ఛ భారత్’’… 600 టన్నుల వ్యర్థాల సేకరణ

ప్రయాగరాజ్ వేదికగా మహా కుంభమేళా ఘనంగా ముగిసింది. దేశం, ప్రపంచం నుంచీ భక్తులు తరలివచ్చారు. 45 రోజుల పాటు సాగిన ఈ కుంభమేళాలో 66 కోట్ల మందికి పైగా పుణ్య స్నానాలు ఆచరించారు. ఈ సందర్భంగా యూపీ ప్రభుత్వం ఎప్పటికప్పుడు పరిశుభ్రత విషయంలో చర్యలు తీసుకుంది. వ్యర్థాలను తొలగించడానికి ప్రత్యేక యంత్రాలను కూడా ఏర్పాటు చేసింది.అయినా వ్యర్థాలు వుండిపోయాయి. ఇప్పుడు వీటిని తొలగించే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం చేపట్టిన క్లీన్‌నెస్‌డ్రైవ్‌లో వేలమంది పారిశుద్ధ్య కార్మికులు, గంగా సేవా దూతలు కీలక పాత్ర పోషిస్తున్నారు. వీరంతా సంగం ఘాట్లు, మేళా గ్రౌండ్ రోడ్లు, పర్మనెంట్, టెంపరరీ ఇన్ ఫ్రాస్ట్రక్చర్లను శుభ్రం చేస్తున్నారు. అలాగే.. తాత్కాలిక పైప్ లైన్లు, స్ట్రీట్ లైట్లు, టెంట్లు, పెవిలియన్లను తొలగిస్తున్నారు.

త్రివేణి సంగమ ప్రాంతంలో..నదిలో తేలుతున్న 600 టన్నుల వ్యర్థాలను సేకరించారు..పారిశుద్ధ్య సిబ్బంది. ఈ వ్యర్థాలను రీసైక్లింగ్‌ చేస్తోంది..ప్రభుత్వం. తద్వారా పర్యావరణానికి హాని కలగని విధంగా వాటిని నిర్మూలిస్తోంది. రెండున్నర కిలోమీటర్ల మేర జరుగుతున్న కుంభమేళా క్లీనింగ్‌ డ్రైవ్‌లో.. 83 భారీ డ్రెడ్జింగ్‌ యంత్రాలను ఉపయోగిస్తున్నారు. ఇప్పటికే ఆరు లక్షల క్యూబిక్ మీటర్లకు పైగా ఇసుక, వ్యర్థాలను తొలగించారు. దాంతో ఇప్పటికే నదీ ప్రవాహం మెరుగుపడింది.

కుంభమేళా ప్రాంతంలో వెయ్యి టెన్నిస్‌ కోర్టులకు సమానమైన ప్రాంతాన్ని ఇప్పటికే శుభ్రం చేశారు..పారిశుద్ధ్య సిబ్బంది. అలాగే మహా కుంభమేళా కోసం ఏర్పాటు చేసిన లక్షన్నర తాత్కాలిక మరుగుదొడ్లను కూడా స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా తొలగిస్తున్నారు. ఈ సందర్భంగా ఉత్పత్తి అయ్యే వ్యర్థాలను క్రమపద్ధతిలో ప్రాసెస్ చేసి నైనిలోని బస్వర్ ప్లాంట్‌కు తరలిస్తున్నారు. మరోవైపు కుంభమేళాలో 15 వేల మంది పారిశుద్ధ్య కార్మికులు క్లీన్ డ్రైవ్ నిర్వహించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *