ప్రాచీన సముద్రయాన వైభవానికి ప్రతిరూపం ‘‘INSV కౌండిన్య‘‘

భారతదేశపు ప్రాచీన సముద్రయాన వైభవానికి, అద్వితీయ నౌకా నిర్మాణ కౌశలానికి ప్రతీకగా నిలిచే ఓ చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. సుప్రసిద్ధ ప్రాచీన భారతీయ నావికుడైన కౌండిన్యుడి పేరుతో, సాంప్రదాయ పద్ధతిలో నిర్మించిన ‘ఓడ’ INSV కౌండిన్య బుధవారం భారత నౌకాదళంలోకి అధికారికంగా ప్రవేశించింది. కర్ణాటకలోని వ్యూహాత్మక కార్వార్ నౌకాస్థావరంలో ఈ కార్యక్రమం వైభవంగా జరిగింది.భారత నౌకాదళంలోకి INSV కౌండిన్యను ప్రవేశపెట్టే కార్యక్రమానికి కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ నౌక, భారతదేశపు సుదీర్ఘ సముద్రయాన అన్వేషణ, వాణిజ్యం, సాంస్కృతిక మార్పిడి సంప్రదాయాలకు సజీవ రూపమని అధికారులు అభివర్ణించారు.

ఈ నౌకను కేరళకు చెందిన నిపుణుల బృందం అత్యంత సంప్రదాయ పద్ధతులను ఉపయోగించి నిర్మించింది. దీనికి మాస్టర్ షిప్ రైట్ బాబు శంకరన్ నాయకత్వం వహించారు. కొబ్బరి తాడు, కొబ్బరి పీచు, సహజమైన రెసిన్ ఉపయోగించి ఓడపై చెక్క పలకలను అమర్చారు.ఈ ప్రాజెక్టులో భారత నావికాదళం కీలక పాత్ర పోషించింది మరియు దాని రూపకల్పన, సాంకేతిక ధ్రువీకరణ మరియు నిర్మాణ ప్రక్రియను దగ్గరుండి పర్యవేక్షించింది. అయితే.. ఈ పద్ధతిలో నిర్మాణం చేసే ఓడల బ్లూప్రింటులు లేవీ ఇప్పుడు అందుబాటులో లేవు. దీంతో ఈ డిజైన్ ను ఐకానో గ్రాఫికల్ మూలాల నుంచి ఊహించుకుంటూ చేయాల్సి వచ్చింది.

హిందూ మహాసముద్రం మీదుగా ఆగ్నేయాసియాకు ప్రయాణించిన కౌండిన్యుడు అనే ప్రఖ్యాత భారతీయ నావికుడి గౌరవార్థం దీనికి ఆ పేరు పెట్టారు. INSV కౌండిన్య కార్వార్‌లోనే తన కార్యకలాపాలు కొనసాగిస్తుందని భారత నౌకాదళం పేర్కొంది. ఈ ఏడాది చివర్లో గుజరాత్ నుంచి ఒమన్ వరకు ప్రాచీన వాణిజ్య మార్గంలో ఈ నౌక సముద్రయానం చేయనుంది.INSV కౌండిన్యుడు అనేక సాంస్కృతిక ప్రాధాన్యత కలిగిన అంశాలను పొందుపరిచింది. “దీని తెరచాపలపై గండభేరుండం, సూర్యుడి చిత్రాలు, ఓడ ముందు భాగంలో సింహ యాలి శిల్పం, ఓడ పైభాగంలో హరప్పా శైలి రాతి లంగరు వంటివి ప్రాచీన భారతదేశపు సముద్రయాన సంప్రదాయాలను గుర్తుకు తెస్తాయి” అని నౌకాదళ ప్రతినిధి వివరించారు.ఆధునిక నౌకలకు పూర్తి భిన్నంగా, ఈ ‘ఓడ’ చతురస్రాకారపు తెరచాపలు, చుక్కాని తెడ్లతో రూపొందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *