బంగ్లాదేశ్ లో జరిగింది జాతి నిర్మూలన చర్యే : వివేకానంద ఫౌండేషన్ సెమినార్ లో వక్తలు
వివేకానంద ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ‘‘బంగ్లాదేశ్ లో మైనారిటీలపై ఎన్నటికీ అంతంలేని హింస’’ అనే అంశంపై సెమినార్ జరిగింది. ఈ సందర్భంగా ఫొటో ఎగ్జిబిషన్ ను కూడా ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ హాజరయ్యారు. న్యూఢిల్లీలో జరిగిన ఈ కార్యక్రమంలో ముస్లిమేతర వర్గాలపై రోజు రోజుకీ పెరుగుతున్న దాడులు, బలవంతపు మత మార్పిళ్లు, భూకబ్జాలపై లోతైన చర్చ జరిగింది.
అయితే… ఈ సెమినార్ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ అందర్నీ ఆలోచింపజేసింది. అందులో
1. రాడికల్ ఇస్లాం వాదులు హిందువులపై చేసిన దాడులు, హిందూ దేవాలయాలపై చేసిన దాడులకి సంబంధించిన ఫొటోలు
2. లైంగిక హింస, బలవంతపు మత మార్పిళ్ల వివరిస్తూ, ప్రాణాలతో బయటపడిన వారి వివరాలు, వారి సాక్ష్యాలు
3. హిందువులకు సంబంధించిన భూములను కబ్జా చేసిన వివరాలు
4.1947లో 29.7 శాతం ఉన్న హిందువుల జనాభా నేడు 7.9 శాతానికి తగ్గిందని డేటా
ఈ సమావేశంలో దౌత్యవేత్తలు, పాత్రికేయులు, భద్రతా నిపుణులు తమ తమ అభిప్రాయాలు వెల్లడించారు. మాజీ డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్, వివేకానంద ఇంటర్నేషన్ ఫౌండేషన్ వైస్ చైర్మన్ సతీష్ చంద్ర, బంగ్లాదేశ్ లో మాజీ హైకమిషనర్ వీణా సిక్రి, శ్యామా ప్రసాద్ ముఖర్జీ రీసెర్చ్ ఫౌండేషన్ చైర్మన్ అనిర్బన్ గంగూలీ, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా వక్తలు బంగ్లాదేశ్ లో హిందువులపై జరిగిన దాడులను ఖండించారు. హిందువుల పరిస్థితిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచం ఇలాగే వ్యవహరిస్తే రాబోయే రెండు దశాబ్దాల్లో బంగ్లాదేశ్ లోని హిందూ జనాభా పూర్తిగా కనుమరుగవుతుందని డాక్టర్ గంగూలీ హెచ్చరించారు. ఇది అంతర్జాతీయ జోక్యాన్ని కోరే మానవతా సంక్షోభమని అన్నారు.
సీనియర్ పాత్రికేయులు, మానవ హక్కుల న్యాయవాది ఫ్రాంకోయిస్ గౌటిర్ ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. బంగ్లాదేశ్ లో జరిగింది చెదురు ముదురు హింస కాదని, జాతి నిర్మూలన చర్యేనన్నారు. ఇంత జరిగినా, ప్రపంచం మాత్రం కళ్లు మూసుకుందంటూ విరుచుకుపడ్డారు.