బంగ్లాదేశ్ వ్యవహారంపై జోక్యం చేసుకోండి : మోదీకి ప్రముఖుల లేఖ
బంగ్లాదేశ్‌లో ఇస్కాన్ నాయకుడు, ఆధ్యాత్మిక వేత్త చిన్మయ్ కృష్ణదాస్ అరెస్టుతో పాటు హిందువులపై జరుగుతున్న దాడులు, హింస విషయంలో కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని కోరుతూ 68 మంది ప్రముఖులు ప్రధాని మోదీకి లేఖ రాశారు. వీరిలో ఓ హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి, పలువురు మాజీ ఐఏఎస్, ఏపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్‌ఎస్ అధికారులు, ఒక ఎంపీ తదిరులు ఉన్నారు. హిందువులు, వారి ఆస్తులు, ఆలయాలపై వ్యవస్థీకృత దాడులు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవలి కాలంలో ఇవి తీవ్రస్థాయికి చేరుకున్నాయని పేర్కొన్నారు.
మహిళలపై హింస మరింత ఆందోళనకరమని, అపహరణలు, బలవంతపు మత మార్పిళ్లు, లైంగిక హింస, మానవ అక్రమ రవాణా వంటికి చోటుచేసుకుంటున్నట్లు నివేదికలు వస్తున్నాయని తెలిపారు. కాగా, బంగ్లాదేశ్‌లో జరుగుతున్న పరిణామాలపై పశ్చిమబెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ స్పందించారు. ఈ విషయంలో తమ ప్రభుత్వం కేంద్రానికి మద్దతుగా ఉంటుందని పేర్కొన్నారు. గురువారం అసెంబ్లీలో మాట్లాడుతూ ‘ఏ మతానికైనా నష్టం జరగాలని మేం కోరుకోం. ఇక్కడి ఇస్కాన్ వాళ్లతో నేను మాట్లాడాను. బంగ్లాదేశ్‌లో జరుగుతున్న ఘటనలపై కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి. ఈ విషయంలో కేంద్రానికి మద్దతుగా ఉంటాం. బంగ్లాదేశ్ వేరే దేశం కావున, మా పరిధిలోకి రాదు. కేంద్ర ప్రభుత్వం జోక్యం తీసుకోవాల్సి ఉంటుంది’ అని పేర్కొన్నారు.