బలవంతంగా మతమార్పిడిలు చేస్తే ఉరిశిక్ష : చట్టం తేనున్న మధ్యప్రదేశ్
మైనర్లపై అత్యాచారాలకు శిక్ష విధించినట్లే, బాలికలను బలవంతంగా మతం మార్చిన వారికి ఉరిశిక్ష విధించేలా త్వరలోనే చట్టాన్ని తీసుకొస్తామని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ప్రకటించారు. మత స్వేచ్ఛ చట్టంలోనే ఉరిశిక్ష నిబంధన ఉంటుందని తెలిపారు. భోపాల్‌లో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవాల్లో పాల్గొన్న ఆయన అతివలపై నేరాలకు పాల్పడేవారి పట్ల తమ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని హెచ్చరించారు.
మహిళా దినోత్సవం సందర్భంగా తన కార్యాలయ నిర్వహణను సీఎం మోహన్ యాదవ్ వనితలకు అప్పగించారు. అక్రమ మతమార్పిడుల వెనుక ఉన్నవారిని కూడా తమ ప్రభుత్వం విడిచిపెట్టదని మోహన్ యాదవ్ తీవ్రంగా హెచ్చరించారు. దుష్ట ఆచారాలు, తప్పుడు వ్యవహారాలపై తమ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని స్పష్టం చేశారు.
“మా అమాయక కుమార్తెలపై దారుణాలకు పాల్పడే వారిపై మా ప్రభుత్వం చాలా కఠినంగా వ్యవహరిస్తుంది. వారిని బలవంతం చేసే వారిని మేం వదిలిపెట్టం. అలాంటి వారిని జీవించడానికి అనుమతించకూడదు. బలవంతపు మత మార్పిడులు చేసే వారికి మరణశిక్ష విధించే నిబంధన మత స్వేచ్ఛ చట్టంలో చేర్చడానికి మేం కృషి చేస్తున్నాం” అని తెలిపారు.