బస్తర్ లోని మారుమూల ప్రాంతాల్లో ఉచితంగా వైద్య సేవలు అందిస్తూ ఆరోగ్యంపై అవగాహన

 

ఇద్దరు దంపతులూ వైద్య విద్యనభ్యసించారు. అత్యంత విలాసవంతమైన జీవితం గడిపే అవకాశం పుష్కలంగా వుంది. అయినా సరే… విలాసాలు, డబ్బులు వద్దు అనుకొని, నక్సలైట్ల ప్రభావిత ప్రాంతం, అత్యంత మారుమూల ప్రాంతాలకు వెళ్లి, వనవాసులకు (గిరిజనులకు) సేవ చేయాలని సంకల్పించుకున్నారు. సంకల్పించుకోవడమే ఆలస్యం… బస్తర్ ప్రాంతానికి వెళ్లి, వారందరికీ వైద్య సేవలు చేస్తూ, సామాజిక సేవలు చేశారు.

రామచంద్ర గోడ్బొలే, సునీతా గోడ్బొలే… ఇద్దరూ అత్యంత నిబద్ధతతో, ప్రచారానికి దూరంగా అత్యంత క్లిష్ట ప్రాంతాలలో వనవాసులకు వైద్య సేవలతో పాటు సామాజిక సేవ చేసినందుకు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు కూడా ప్రకటించింది. నిజానికి మూలత: వీరు మహారాష్ట్ర వాసులు.ఆయుర్వేద వైద్య శాస్త్రాన్ని అభ్యసించారు. అత్యంత సౌకర్యవంతమైన, విలాసవంతమైన జీవితాన్ని వదిలేసి, అత్యంత పేదరికం, రోడ్లు కూడా లేని మారమూల ప్రాంతమైన బస్తర్ లో సేవ చేయాలని నిర్ణయించుకున్నారు. దీంతో బస్తర్ వాసుల జీవితమే మలుపు తిరిగింది.

మూడు దశాబ్దాలకు పైగా ఈ దంపతులు గిరిజనులకు ఉచిత వైద్య చికిత్సను అందిస్తున్నారు. వాహనంపై గ్రామ గ్రామన తిరుగుతూ, ఔషదాలను ఉచితంగా అందసి్తున్నారు. అనారోగ్యాలు, ఇన్ఫెక్షన్లు, గాయాలు, పోషకాహార లోపం, ప్రసూతి లాంటి సమస్యలకు ఉచితంగా వైద్య చికిత్సలు అందిస్తున్నారు.దీంతో అనేక మంది ఈ దపంతులపైనే ఆధారపడటం ప్రారంభించారు.

సునీతా గోడ్బోలే కూడా అంతే ముఖ్యమైన పాత్ర పోషించారు. ఆమె పోషణ, ప్రసూతి ఆరోగ్యం, పరిశుభ్రత మరియు ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ అవగాహనపై దృష్టి సారిస్తూ మహిళలు, పిల్లలతో కలిసి పనిచేశారు. వనవాసీ మహిళల్లో ఆరోగ్యంపై శ్రద్ధ, కనీస అవగాహనను పెంచారు.అలాగే అక్కడ పోషకాహార లోపం విపరీతంగా వుంది. దీంతో వారికి పోషకాహారం స్వీకరించడంపై అవగాహనను పెంచి, వారి ఆరోగ్యాలను బాగు చేశారు.

కేవలం ఈ ప్రాంతాలను సందర్శించడమే కాకుండా, వనవాసుల మధ్యే వారు కూడా నివసించారు. వారిలో భాగమైపోయారు. వనవాసుల సంప్రదాయాలను, సంస్కృతిని గౌరవిస్తూనే, వారిలో పరిశుభ్రత, ఆరోగ్యంపై విశేషంగా అవగాహన కలిగేలా చేశారు.

భారతదేశ అభివృద్ధి అంటే కేవలం నగరాలు, పరిశ్రమలు మరియు సాంకేతికత మాత్రమే కాదని; మారుమూల గ్రామాలకు సైతం చేరుకోవడం, అలాగే అత్యంత నిరుపేద పౌరులకు కూడా ఆరోగ్య సంరక్షణ, గౌరవం మరియు అవకాశాలు లభించేలా చూడటమేనని ఈ దంపతుల జీవనయాత్ర తెలియజేస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *