బెంగళూరు అల్లర్లు కేసు: 17మంది ఇస్లామిక్ అతివాద సంస్థల కార్యకర్తలు అరెస్ట్

దేశవ్యాప్తంగా ఆందోళన రేకెత్తించిన బెంగళూరు అల్లర్ల కేసు విచారణలో జాతీయ దర్యాప్తు సంస్థ పురోగతి సాధించింది. ఈ అల్లర్లకు సంబంధించి 17 మంది ఇస్లామిక్ అతివాద సంస్థ సభ్యులను అరెస్ట్ చేసింది.

ఈ  ఏడాది ఆగ‌స్టు 11న బెంగుళూరు ప‌రిధిలోని పుల‌కేశిన‌ర‌గ‌ర్‌ కాంగ్రెస్ ఎమ్మెల్యే అఖండ శ్రీ‌నివాస్ మేన‌ల్లుడు ఫెస్‌బుక్‌లో చేసిన పోస్టుకు నిర‌స‌నగా కె.జి హ‌ల్లి పోలీసు స్టేష‌న్ ప‌రిధిలో ముస్లిం వర్గానికి చెందిన వ్యక్తులు హింసాత్మ‌క దాడులు, పెద్ద ఎత్తున అల్ల‌ర్ల‌కు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై విచారణను జాతీయ దర్యాప్తు సంస్థకు అప్పగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

దీనిపై విచారణ చేపట్టిన జాతీయ దర్యాప్తు సంస్థ, ఈ అల్లర్లలో ప్రమేయం ఉన్న 17మంది సోష‌ల్ డెమోక్ర‌టిక్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎస్‌.డి.పి.ఐ),  పాపుల‌ర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పి.ఎఫ్‌.ఐ) కార్య‌క‌ర్త‌లను సోమ‌వారం అరెస్టు చేసింది. ఈమేరకు జాతీయ భ‌ద్ర‌తా సంస్థ ఒక ప్ర‌క‌ట‌న కూడా విడుదల చేసింది.

బెంగుళూర్‌లో జ‌రిగిన అల్ల‌ర్ల‌కు సంబంధించి ముంద‌స్తుగానే స‌మావేశాలు ఏర్పాటు చేసి జ‌నాన్ని స‌మీక‌రించి హింస‌ను ప్రేరెపించ‌డంతో పాటు, కె.జి హ‌ల్లి పోలీసు స్టేష‌న్ పై దాడి చేసి భారీ న‌ష్టం క‌లిగించినందుకు గాను ఎస్‌.డి.పి.ఐ బెంగ‌ళూర్ జిల్లా అధ్య‌క్షుడు ఎండి. షరీఫ్,  కెజి హల్లి వార్డ్ ప్రెసిడెంట్ ఇమ్రాన్ అహ్మద్ తో పాటు రుబా వకాస్, షబ్బార్ ఖాన్‌, షేక్ అజ్మల్ ను విచారించిన‌ట్టు ఎన్‌.ఐ.ఏ పెర్కొంది. అదే విధంగా కె.జిహ‌ల్లి పోలీసు స్టేష‌న్‌లో పెద్ద సంఖ్య‌లో జ‌నాన్ని స‌మీక‌రించినందుకు ఎస్‌.డి.పి.ఐ నాగ్వారా వార్డు అధ్య‌క్షుడు అబ్బాస్ త‌న అనుచ‌రులు  అజిల్ పాషా, ఇర్ఫాన్ ఖాన్, అక్బర్ ఖాన్ ల‌ను ఎన్‌.ఐ.ఏ విచారించిన‌ట్టు తెలిపింది.

అల్ల‌ర్లు వ్యాప్తి చేయడానికి సద్దాం, సయ్యద్ సోహెల్, కలీముల్లా అనే నిందితులు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్స‌ప్ వంటి సోషల్ మీడియా ఉపయోగించార‌ని,  వారు ప్ర‌తేక్షంగా అల్లర్లలో పాల్గొన‌డంతో పాటు ఇతరులను పోలీస్ స్టేషన్ వద్ద గుమిగూడడానికి ప్రేరేపించిన‌ట్టు విచార‌ణ‌లో వెల్ల‌డైంద‌ని ఎన్‌.ఐ.ఏ పెర్కొంది. ఈ కేసులో ఇప్పటివరకు 187 మంది నిందితులను అరెస్టు చేశారు. దర్యాప్తు  కొనసాగుతోంద‌ని ఎన్‌.ఐ.ఏ వెల్ల‌డించింది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *