బెంగాల్ లో హింస.. 110 మందికి పైగా అరెస్టులు
వక్ఫ్ (సవరణ) చట్టానికి వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్ లోని ముర్షిదాబాద్‌లో మళ్లీ హింస చెలరేగింది. శుక్రవారం నుంచి కొనసాగుతున్న నిరసనలు మళ్లీ హింసాత్మకంగా మారాయి. శనివారం మాల్దా, ముర్షిదాబాద్, సౌత్ 24 పరగణాలు, హుగ్లీ జిల్లాల్లో నిరసనకారులు పెద్దఎత్తున ఆందోళనకు దిగి రోడ్లను దిగ్బంధించారు.
ఆపడానికి ప్రయత్నించిన భద్రతా సిబ్బందిపై నిరసనకారులు రాళ్లు రువ్వడంతో పరిస్థితి హింసాత్మకంగా మారింది. ఈ హింసకు కారణమైన 110 మందికిపైగా నిరసనకారులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. పరిస్థితి ఇప్పటికీ ఉద్రిక్తంగానే ఉందని, హింసాత్మక చర్యలు నెలకొంటున్న నేపథ్యంలో ముర్షిదాబాద్ జిల్లాలో పలు నిషేధాజ్ఞలు విధించామని, ఇంటర్నెట్ సేవలను నిలిపివేశామని అధికారులు తెలిపారు.
శాంతిభద్రతలను పునరుద్ధరించడానికి తగిన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. సోషల్ మీడియాలో వ్యాప్తిచేస్తున్న వదంతులను పట్టించుకోవద్దని విజ్ఞప్తి చేశారు. ఘర్షణల్లో గాయపడిన 10 మంది పోలీసులు, ఓ యువకుడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వక్ఫ్ చట్టం మంగళవారం నుంచి అమల్లోకి వచ్చిందని, ఈ మేరకు కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ ఒక నోటిఫికేషన్‌ను విడుదల చేసిందని, అయితే పశ్చిమబెంగాల్‌లో వక్ఫ్ సవరణ చట్టాన్ని అమలు చేయబోమని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించారు.
వక్ఫ్ చట్టాన్ని కేంద్రం రూపొందించిందని, దీనికి సమాధానాలు కేంద్రమే ఇస్తుందని ఆమె స్పష్టం చేశారు. అన్ని మతాల ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నానని, అందరూ శాంతియుతంగా ఉండాలన్నారు.