బెల్లంతో గణపతి విగ్రహం: 75 అడుగుల అద్భుతం
భారీ వినాయక విగ్రహం విశాఖ పశ్చిమ నియోజకవర్గంలోని పారిశ్రామిక ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్నారు. 75 అడుగుల ఎత్తుతో ఈ విగ్రహాన్ని పూర్తిగా కాలుష్య రహితంగా నెలకొల్పుతుండటం ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఇప్పటి వరకూ దేశంలో ఎక్కడా బెల్లం వినాయకుడి విగ్రహంతో చవితి వేడుకలు చేసిన దాఖలాలు లేవని నిర్వాహకులు చెబుతున్నారు. విగ్రహం ఏర్పాటుకు ఆధారంగా సరుగుడు కర్రలు, వాటికి వెదురుబద్దలతో వినాయకుడి ఆకారాన్ని రూపొందిస్తున్నారు. ఆ వెదురుబద్దలకే గోనె (నార) చుడుతున్నారు. చిన్న పరిమాణం కలిగిన బెల్లం కుందులను ఒకదానిపై మరోటి ఆకారానికి అనువుగా పేర్చి అదుపు తప్పి కింద పడకుండా నారతో కడుతున్నారు.
లంబోదర ట్రస్టు ఛైర్మన్ మొల్లి గోవర్థన్ ఆలోచనతో మూడు వారాలపాటు వినాయక చవితి వేడుకలను వినూత్నంగా నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందించారు. బెల్లాన్ని అన్ని రోజులపాటు ఉంచితే ముద్దగామారే అవకాశాలు ఎక్కువ. వ్యవసాయ అధికారులు, అనకాపల్లి బెల్లం మార్కెట్ నిపుణుల సలహాతో ఏకంగా రాజస్థాన్‌లో ప్రత్యేకంగా తయారు చేయించారు. బెల్లం కుందులు కాస్త గట్టిగా ఉండేలా తయారు చేయించడం గమనార్హం. 75 అడుగుల ఎత్తు, 24 అడుగుల వెడల్పుతో విగ్రహం తయారీకి దాదాపు 18 టన్నుల వరకు వినియోగిస్తున్నారు. వేడుకల ముగింపు రోజున ఈ బెల్లం కుందులను ప్రసాదంగా భక్తులకు వితరణ చేయనున్నట్లు నిర్వాహకులు వెల్లడిస్తున్నారు.