రానూ రానూ ‘‘జీవ ఇంధనం’’ యుగమే.. దేశీయ తయారీ, ఖర్చు, కాలుష్యం తక్కువ
ఇపుడు ప్రపంచమంతా ఆందోళన చెందుతోన్న అంశం కాలుష్యం. దీనిని ఎలా కట్టడి చేయాలో రకరకాల ఆలోచనలు వస్తున్నాయి. అయితే… ఏది ఎలా వున్నా… జీవ వ్యర్థాల నుంచి తయారు చేస్తున్న ఇంధనాలు ఎక్కువ కాలుష్యాన్ని రానివ్వవని, పర్యావరణానికి అనుకూలమని అందరూ గట్టిగా నమ్ముతున్నారు. ఖర్చు కూడా తక్కువేనని, ఆర్థిక వృద్ధికి కూడా బాగానే దోహదపడతాయని భావిస్తున్నారు. రానూ రానూ జీవ వ్యర్థాల నుంచి వచ్చే ఇంధనాలు దేశ అవసరాలకు ముఖ్య వనరులుగా మారనున్నాయి. జీవ వ్యర్థ పదార్థాలను నేరుగా మండిరచి, లేదా సూక్ష్మజీవుల సమక్షంలో కిణ్వన ప్రక్రియ చేసి, దాని ద్వారా వచ్చే శక్తిని ‘‘జీవ ఇంధనం’’ అంటున్నారు. భారత దేశం వ్యవసాయ ప్రధాన దేశం కాబట్టి, జీవ ఇంధనాల ఉత్పత్తికి ఇక్కడే ఎక్కువగా ముడి సరుకు లభ్యమవుతుంది. పశు సంపద కూడా ఇక్కడే అధికం. ఏయే వాటి నుంచి జీవ ఇంధనాన్ని తయారు చేయవచ్చో చూద్దాం.
1. బయోగ్యాస్ : పశువుల పేడ, చెట్ల సంబంధిత వ్యర్థ పదార్థాలను ఆక్సిజన్ రహితంగా కుళ్లబెట్టడం ద్వారా, లేదంటే చెట్ల వ్యర్థాలు, పట్టణ వ్యర్థాలను మిథనో మోనాస్, మిథనో కోకస్ లాంటి బ్యాక్టీరియాల సమక్షంలో కిణ్వన ప్రక్రియ చేయడం ద్వారా బయోగ్యాస్ తయారు చేస్తారు. దీనిని గోబర్ గ్యాస్ అని కూడా అంటారు. బయోగ్యాస్ 60శాతం, మీథేన్ 40 శాతం, కార్బన్‌డై ఆక్సైడ్ వాయువులతో వుంటుంది. ఈ గ్యాస్ కాలుష్య రహితమైంది. అత్యంత తక్కువ ఖర్చుపైగా. దీనిని సహజ వాయువు లాగా కంప్రెస్ కూడా చేయవచ్చు. వంటగ్యాస్, ఎలక్ట్రిసిటీ ఉత్పత్తి ప్రక్రియల్లో దీనిని వాడొచ్చు.
2. బయో ఇథనాల్ : దీనిని చెరుకు లేదా మొక్కజొన్న మొలాసిస్ నుంచి తయారు చేస్తారు. మొలాసిస్‌కు సుక్రోజ్, ఇన్వర్టేజ్ అనే ఎంజైమ్‌లను లేదా ఈస్ట్‌ను కలిపి కిణ్వన ప్రక్రియకు గురిచేస్తారు. ఈ ప్రక్రియ ప్రారంభమైన 12 లేదా 24 గంటల వ్యవధిలో ‘‘ఇన్వర్టేజ్’’ అనే ఎంజైమ్ మొలాసిస్‌ను గ్లూకోజ్, ప్రక్టోజ్‌లుగా విడగొడుతుంది. ఈ గ్లూకోజ్, ఫ్రక్టోజ్‌లను ‘‘జైమేజ్’’ అనే ఎంజైమ్ ఇథైల్ ఆల్కాహాల్, కార్బన్‌డై ఆక్సైడ్‌లుగా మారుస్తుంది. ఈ విధంగా ఏర్పడిన ఇథనాల్‌ను అంశిక స్వేదనం ద్వారా వేరు చేస్తారు. దీన్ని గ్యాసోహాల్ అంటారు.
3. బయో హైడ్రోజన్ గ్యాస్ : బయోమాస్‌ను హైడ్రోజొమోనాస్ బ్యాక్టీరియా సమక్షంలో కిణ్వన ప్రక్రియకు గురి చేసినప్పుడు హైడ్రోజన్ విడుదలవుతుంది. ఇది కాలుష్యరహితం. అత్యంత ఖరీదు కూడా కాదు. దీన్ని రాకెట్లలో ఇంధనంగా, హైడ్రోజన్ బ్యాటరీతో వాహనాలను నడిపించడానికి, విద్యుత్తు ఉత్పత్తికి కూడా వాడతారు.
4. బయోడీజిల్ : జంతువుల కొవ్వు, వెజిబుల్ ఆయిల్, మొక్క భాగాల నుంచి గ్రహించిన ముడి నూనెలను ఆల్కహాల్‌తో చర్య జరిపిస్తే ఎస్టర్స్, గ్లిసరాల్స్ ఏర్పడతాయి. ఈ ప్రక్రియను ట్రాన్స్ ఎస్టరిఫికేషన్ అంటారు. ఈ ప్రక్రియలో ఏర్పడిన ఎస్టర్లను బయోడీజిల్‌గా వ్యవహరిస్తారు. దీన్ని నేరుగా లేదా పెట్రో డీజిల్‌తో కలిపి ఉపయోగించవచ్చు. ఇది ఎకోఫ్రెండ్లీ. గానుగ, జట్రోపా చెట్ల నుంచి బయోడీజిల్‌ను తయారు చేస్తున్నారు.
జీవ ఇంధనాల వల్ల కలిగే ఉపయోగాలివీ…
1. ఇవి పునరుత్పత్తికి సాధ్యమైన ఇంధన వనరులు
2. పర్యావరణ స్నేహపూర్వక ఇంధనాలు. శిలాజ ఇంధనాలతో పోల్చినపుడు జీవ ఇంధనాలు చాలా తక్కువ ఉద్గారాలను వెలువరుస్తాయి.
3. శిలాజ ఇంధనాలతో పోలిస్తే జీవ ఇంధనాల ఖరీదు తక్కువ.
4. వీటిని ప్రాంతీయంగా లేదా దేశీయంగా ఉత్పత్తి చేసుకోవచ్చు. దానివల్ల శిలాజ ఇంధనాలపై ఒక దేశం, మరొక దేశంపై ఆధారపడాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా రవాణా ఖర్చులను కూడా ఆదా చేసుకోవచ్చు.
5. వీటిని దేశీయంగా ఉత్పత్తి చేసుకోవచ్చు. ఎప్పటికపుడు రీసైక్లింగ్ జరిగి పర్యావరణం సురక్షితం.