భవిష్యత్ తరాల కోసం ప్రకృతిని కాపాడదాం : ప్రధాని మోదీ

భవిష్యత్ తరాల కోసం ప్రకృతిని కాపాడాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. అలాగే అపురూపమైన జీవ వైవిధ్యాన్ని సంరక్షించడానికి ప్రపంచంలోని ప్రజలంతా కృషి చేయాలన్నారు. ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం సందర్భంగా ట్విట్టర్ వేదికగా ఓ వీడియోను పోస్ట్ చేశారు. అలాగే గుజరాత్ లోని జునాగఢ్ జిల్లాలోని గిర్ అడవుల్లో మోదీ సఫారీ చేశారు. రాబోయే తరాలకు మంచి భవిష్యత్తును ఇవ్వడానికి ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై వుందన్నారు. వన్యప్రాణులను సంరక్షించడంలో భారత్ కృషి చేస్తోందని, అందుకు తాను చాలా గర్వపడుతున్నానని ప్రకటించారు.

మరోవైపు గుజరాత్ పర్యటనలో వున్న ప్రధాని మోదీ రిలయన్స్ సంస్థ నిర్వహిస్తున్న వన్యప్రాణుల పునరావాసం, సంరక్షణ కేంద్రమైన వంతారాను ప్రారంభించారు. ఈ సందర్భంగా ముకేశ్ అంబానీ కుటుంబ సమేతంగా ప్రధానికి స్వాగతం పలికారు. పునరావాస కేంద్రంలోని వివిధ రకాల జంతువులతో ప్రధాని సరదాగా గడిపారు. అదేవిధంగా పులి, సింహం పిల్లలతో కాసేపు ఆడుకున్నారు. వాటికి పాలను అందించారు మోదీ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *