భారత్‌లో 39 శాతానికిపైగా బ్యాంకు ఖాతాలు మహిళల పేరిటే

భారతదేశంలోని మొత్తం బ్యాంకు ఖాతాల్లో 39.2శాతం అకౌంట్స్‌ మహిళల పేరిట ఉన్నాయి. ఇందులో ఆసక్తికరమైన విషయం ఏంటంటే పట్టణ మహిళల కంటే గ్రామీణ ప్రాంతాల మహిళల సంఖ్యే ఎక్కువగా ఉన్నది. 42.2శాతం బ్యాంకు ఖాతాలు గ్రామీణ మహిళల పేరిట ఉన్నాయి. ఈ విషయాన్ని గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ ‘ఉమెన్‌ అండ్‌ మెన్‌ ఇన్‌ ఇండియా 2024’: సెలెక్టెడ్‌ ఇండికేటర్స్‌ అండ్‌ డేటా పేరుతో నివేదిక విడుదల చేసింది.

ఈ నివేదిక భారత్‌లో లింగ ప్రాతిపదికన సమగ్ర చిత్రాన్ని చూపించింది. ఇందులో జనాభా, విద్య, ఆరోగ్యం, ఆర్థిక భాగస్వామ్యం, నిర్ణయాలు తీసుకోవడం వంటివాటికి సంబంధించిన సమగ్ర డేటా ఉన్నది. ఈ గణాంకాలను వివిధ మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ విభాగాల నుంచి సేకరించారు. ఈ డేటా ప్రకారం.. బ్యాంకు డిపాజిట్లలో మహిళల వాటా 39.7శాతంగా ఉన్నది. గ్రామీణ భారతదేశంలోని వారి భాగస్వామ్యం అత్యధికంగా ఉన్నది.

ఇక్కడ ప్రతి రెండు ఖాతాల్లో దాదాపు ఒకటి మహిళ పేరుతో ఉంది. ఇంకా విశేషమేంటంటే బ్యాంకు ఖాతాల్లో మహిళల భాగస్వామ్యం గ్రామీణ ప్రాంతాల్లో అత్యధికం. ఇక్కడ ఖాతాదారుల్లో వారి వాటా 42.2శాతంగా ఉన్నది. ఈ నివేదిక ప్రకారం స్టాక్ మార్కెట్‌పై మహిళలు సైతం ఆసక్తి కనబరుస్తున్నారు. తద్వారా డీమ్యాట్ ఖాతాల సంఖ్య కూడా విపరీతంగా పెరిగింది.

31 మార్చి 2021 నుంచి 30 నవంబర్ 2024 మధ్య డీమ్యాట్ ఖాతాలు 3.326 కోట్ల నుంచి 14.302 కోట్లకు పెరిగాయి. అంటే దాదాపు నాలుగు రెట్లు పెరుగుదల నమోదైంది. ఇప్పటికీ పురుషుల డీమ్యాట్‌ ఖాతాల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ, మహిళల భాగస్వామ్యం రోజురోజుకు పెరుగుతూ వస్తున్నది.
2021లో పురుషుల ఖాతాల సంఖ్య 2.659 కోట్లుగా ఉండగా 2024లో ఇది 11.531 కోట్లకు పెరిగింది.

అదే సమయంలో, మహిళా ఖాతాల సంఖ్య 0.667 కోట్ల నుంచి 2.771 కోట్లకు చేరింది. అలాగే, 2021 -2024 మధ్య వాణిజ్యం, తయారీ, ఇతర సేవా రంగాల్లో మహిళల యాజమాన్యంలోని సంస్థల సంఖ్య (యాజమాన్య సంస్థలు) సైతం క్రమంగా పెరిగిందని నివేదిక తెలిపింది. ఇది మహిళల అభివృద్ధికి చాలా మంచి సంకేతమని.. ఇది మహిళా వ్యవస్థాపకత పెరుగుతోందని చూపిస్తుందని చెప్పింది.మరోవంక, ఎన్నికల్లో మహిళల భాగస్వామ్యం సైతం గొప్పగా ఉన్నది. 1952లో భారత్‌లో మొత్తం 17.32 కోట్ల మంది ఉన్నారు. ఇది 2024 నాటికి 97.8కోట్లకు చేరింది. ఈ కాలంలో మహిళా ఓటర్ల సంఖ్య సైతం గణనీయంగా పెరిగింది. దాంతో లింగ ఆధారిత ఓటింగ్‌ అంతరాన్ని భారీగా తగ్గించింది. వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ (డిపిఐఐటి)లోని పారిశ్రామిక విధానం, ప్రమోషన్ విభాగం గుర్తించిన స్టార్టప్‌ల రంగంలో కూడా మహిళల ప్రాతినిధ్యం పెరుగుతుంది.

2017లో కనీసం ఒక మహిళా డైరెక్టర్ ఉన్న స్టార్టప్‌లు 1,943 మాత్రమే ఉండగా, 2024 నాటికి వాటి సంఖ్య 17,405కి పెరిగింది. విద్యా రంగంలో కూడా సానుకూల సంకేతాలు ఉన్నాయి. ప్రాథమిక, ఉన్నత మాధ్యమిక స్థాయిలో లింగ సమానత్వ సూచిక (జిపిఐ) ఎక్కువగా ఉంది. ఉన్నత ప్రాథమిక, ప్రాథమిక స్థాయిలో కొంత వైవిధ్యం ఉన్నప్పటికీ, అది సమానత్వానికి దగ్గరగానే ఉందని నివేదిక వివరించింది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *