భారత్ కి కలిగిన నష్టాన్ని రుజువు చేస్తారా? అజిత్ దోవల్ సవాల్
ఆపరేషన్ సిందూర్ పై జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ స్పందించారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో పాక్ చేసిన దాడుల వల్ల భారత్ కి నష్టం కలిగిందన్న విదేశీ మీడియాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పాక్ దాడుల్లో భారత్ కి నష్టం కలిగిందనే విషయాన్ని రుజువు చేయడానికి ఏ ఒక్క ఆధారాన్నైనా చూపాలని సవాల్ విసిరారు. మద్రాసు ఐఐటీ 62 వ స్నాతకోత్సవ కార్యక్రమంలో దోవల్ ప్రసంగించారు.
ఆపరేషన్ సిందూర్ లో స్వదేశీ రక్షణ సాంకేతికతను వినియోగించి దాయాది పాకిస్తాన్ కి ముచ్చెమటలు పట్టించామని దోవల్ ప్రకటించారు. ఈ సందర్భంగా భారత సైన్యం పాక్ లోని ఉగ్ర స్థావరాలను ఎలా ధ్వంసం చేసిందో వివరించారు. మొత్తం ఈ ఆపరేషన్ 23 నిమిషాల్లో ముగిసిందని తెలిపారు.
ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్ ఏదేదో చేసిందంటూ విదేశీ మీడియా అసత్య కథనాలను ప్రసారం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాక్ లో ఉగ్రవాద స్థావరాలు ఎక్కడెక్కడ వున్నాయన్న అకచ్చిత సమాచారంతోనే భారత సైన్యం దాడులు నిర్వహించిందని ప్రకటించారు. పాక్ లోని 13 వైమానిక స్థావరాలు ధ్వంసమైన ఫొటోలు మాత్రం బయటకు వచ్చాయని, కానీ.. భారత్ కి నష్టం జరిగినట్లు ఒక్క ఫొటో కూడా లేదని వివరించారు. భారత్ కి చెందిన ఆయుధ స్థావరాలకు చిన్న గీత కూడా పడనివ్వకుండా భారత సైన్యం కంటికి రెప్పలా చూసుకుందని తెలిపారు.