భారత్ ధర్మశాల కాదు : సుప్రీం కీలక వ్యాఖ్యలు

భారతదేశం ధర్మశాల కాదని, వివిధ దేశాల నుంచి వచ్చే శరణార్థులందరికీ ఆతిథ్యం ఇవ్వడం కుదరదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. శ్రీలంక తమిళ శరణార్థి దాఖలు చేసిన పిటిషన్‌ సోమవారం సుప్రీంకోర్టు తిరస్కరించింది. శ్రీలంక తమిళ జాతీయుడి నిర్బంధంలో విషయంలో జోక్యం చేసుకోవడానికి సర్వోన్నత న్యాయస్థానం జస్టిస్‌ కే వినోద్‌ చంద్రన్‌తో కూడిన ధర్మాసనం నిరాకరించింది.పిటిషన్‌పై వాదనల సందర్భంగా ‘భారతదేశం ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే శరణార్థులకు ఆతిథ్యం ఇవ్వగలదా? మేము 140 కోట్ల మందితో ఇబ్బంది పడుతున్నాం. ఇది అన్ని దేశాల నుంచి వచ్చే విదేశీ పౌరులకు ఆతిథ్యం ఇచ్చేందుకు ధర్మశాల కాదు’ అని జస్టిస్‌ దీపాంకర్‌ దత్తా అభిప్రాయపడ్డారు. vయూఏపీఏ కేసులో విధించిన ఏడు సంవత్సరాల జైలు శిక్ష ముగిసిన వెంటనే పిటిషనర్ వెంటనే భారతదేశం విడిచి వెళ్లాలని ఆదేశించిన మద్రాస్ హైకోర్టు ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారించింది.
పిటిషనర్‌ తరఫున న్యాయవాది వాదనలు వినిపిస్తూ పిటిషనర్‌ శ్రీలంక తమిళుడని, వీసాపై ఇక్కడికి వచ్చాడని తెలిపారు. స్వదేశంలో తన ప్రాణానికి ముప్పు ఉందని ధర్మాసనానికి చెప్పారు. పిటిషనర్ దాదాపు మూడు సంవత్సరాలుగా నిర్బంధంలో ఉన్నారని తెలిపారు. పిటిషనర్‌ ఓ శరణార్థి అని, తని భార్య, పిల్లలు ఇక్కడ భారత్‌లోనే స్థిరపడ్డారని న్యాయవాది తెలిపారు. పిటిషనర్‌ భార్య పలు ఆరోగ్య సమస్యలు, కుమారుడు పుట్టుకతోనే గుండె జబ్బులతో బాధపడుతున్నారని పేర్కొన్నారు.
అయితే, జస్టిస్ దత్తా పిటిషనర్ భారతదేశంలో నివసించేందుకు ఉన్న చట్టబద్ధమైన హక్కు ఏంటని ప్రశ్నించారు. ఆర్టికల్ 19 కింద స్థిరపడే హక్కు భారత పౌరులకు మాత్రమే వర్తిస్తుందని, తగిన చట్టపరమైన ప్రక్రియను అనుసరించినందున ఆర్టికల్ 21 ఉల్లంఘన జరగలేదని జస్టిస్‌ దత్తా పేర్కొన్నారు. పిటిషనర్ తన దేశంలో ప్రాణాలకు ముప్పు ఎదుర్కొంటున్నారని న్యాయవాది తెలుపగా ‘వేరే దేశానికి వెళ్లండి’ అని జస్టిస్‌ దత్తా వ్యాఖ్యానించారు. ఇటీవల రోహింగ్యా శరణార్థులకు సంబంధించిన కేసులోనూ జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరించిన విషయం తెలిసిందే.
ఇదిలా ఉండగా 2015లో పిటిషనర్‌తో పాటు మరో ఇద్దరిని ఎల్‌టీటీఈకి చెందిన వ్యక్తులుగా భావించి తమిళనాడు క్యూ బ్రాంచ్‌ అరెస్ట్‌ చేసింది. 2018లో ఉపా సెక్షన్‌ 10 కింద ట్రయల్‌ కోర్టు పిటిషనర్‌ను దోషిగా నిర్దారిస్తూ పదేళ్ల జైలు శిక్ష విధించింది. 2022లో మద్రాస్ హైకోర్టు అతని శిక్షను 7 సంవత్సరాలకు తగ్గించింది.అయితే, శిక్ష తర్వాత పిటిషనర్‌ వెంటనే భారతదేశం విడిచి వెళ్లాలని, అప్పటి వరకు శరణార్థి శిబిరంలోనే ఉండాలని ఆదేశించింది. 2009లో ఎల్‌టీటీఈ మాజీ సభ్యుడిగా శ్రీలంక యుద్ధంలో పోరాడినందున, తనను శ్రీలంకలో బ్లాక్ గెజిటెడ్‌గా ఉంచారని పిటిషనర్ తెలిపారు. మళ్లీ తనను శ్రీలంక పంపితే అరెస్టుతో పాటు హింసను ఎదుర్కోవాల్సి వస్తుందని పిటిషనర్‌ పేర్కొన్నారు. పిటిషనర్ తరపున ఆర్ సుధాకరన్, ఎస్‌ ప్రభు రామసుబ్రమణియన్, వైరవన్ వాదనలు వినిపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *