భారీ భద్రత నడుమ అమర్ నాథ్ యాత్ర ప్రారంభం
అమరనాథ్ యాత్ర ప్రారంభమైంది. జమ్మూ కశ్మీర్ నుంచి 5,880 మంది భక్తులు మొదటి బ్యాచ్ గా బయల్దేరారు. అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య వారు బయల్దేరారు. భగవతి నగర్ యాత్రి నివాస్‌లో పూజలు నిర్వహించి ఈ యాత్రను లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా జెండా ఊపి ప్రారంభించారు. ఈ మొదటి బ్యాచ్ లో 1,115 మంది మహిళలు, 31 మంది చిన్నారులు వున్నారు.
పహల్గామ్, బాల్తాల్ మార్గాల ద్వారా 38 రోజుల పాటు అమర్ నాథ్ యాత్ర జరగనుంది. ఇప్పటివరకు అమర్ నాథ్ యాత్రకు దాదాపు 3.5 లక్షల మంది యాత్రికులు రిజిస్టర్ చేసుకున్నారు. మరోవైపు పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో అమర్ నాథ్ యాత్రకు కేంద్రం భారీ భద్రత కల్పించింది.
ఈ యాత్ర పహల్గామ్, బాల్తాల్ అనే రెండు మార్గాల ద్వారా సాగుతుంది. పహల్గామ్ మార్గం 48 కిలోమీటర్ల దూరం ఉంటుంది. బాల్తాల్ మార్గం 14 కిలోమీటర్ల దూరంతో ఉంటుంది. కానీ.. ఇది చాలా ఎక్కువ ఎత్తుతో ఉంటుంది. ఇది చిన్న మార్గమే కానీ.. కష్టమైన మార్గంగా ఉంది. ఈ రెండు మార్గాల్లోనూ యాత్రికులకు సౌకర్యవంతమైన ఏర్పాట్లు చేశారు. ఇటీవలి పహల్గామ్ ఉగ్రవాద దాడి, అలాగే కొన్ని ఉగ్రవాదుల హెచ్చరికల కారణంగా పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. RFID ట్రాకింగ్, వైద్య సహాయం, మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించారు. నిరంతరం యాత్రికుల్ని గమనిస్తూ, వారికి ఆపద రాకుండా ఉండేలా అధికారులు అన్ని చర్యలూ తీసుకున్నారు.