మక్క పంట ‘‘పండింది’’… రికార్డు స్థాయిలో పలుకుతున్న ధరలు
తెలంగాణలో మక్క పంట పడింది. మక్కలకు విపరీతమైన ధర పలుకుతోంది. దీంతో మక్క పంట వేసిన రైతులు తీవ్ర ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మద్దతు ధర 2,225 కాగా, అంతకంటే ఏడెనిమిది వందలు ఎక్కువ రేటే వస్తోంది. క్వింటాల్ కి మూడు వేల దాకా పెట్టి మరీ, వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారంటే పరిస్థితి ఎలా వుందో మనం ఊహించుకోవచ్చు. మార్కెట్ లో మక్కలకు ఇంత ఎక్కువ ధర రావడం ఇదే ఫస్ట్ టైం అని వ్యాపారులు అంటున్నారు.
వరంగల్ జిల్లాలోని ఎనుమాముల మార్కెట్ లో మక్కలకు గత నెల రోజుల్లో అత్యధికంగా 2,961 రూపాయల రికార్డు ధర పలికింది. కనిష్టంగా 2,712 వరకు వచ్చింది. ఇక గత వారం రోజుల్లో కనిష్టంగా 2,902 రూపాయలు పలుకగా, 2,961 రూపాయలు గరిష్టంగా పలికింది. గత నెల రోజులుగా ఏనాడూ మద్దతు ధర కంటే తక్కువ పలకలేదు.
ఇథనాల్ లో మక్కల వినియోగం పెరగడం వల్లే?
అయితే మక్కల ధరలు విపరీతంగా పెరగడం వెనుక ఓ కారణం వుందని వ్యాపారులు అంటున్నారు. ఇథనాల్ తయారీలో మక్కల వినియోగం పెరగడంతోనే బాగా డిమాండ్ వుందని అంటున్నారు. దీనిని మార్కెటింగ్ శాఖ కూడా ధ్రువీకరిస్తోంది. దేశంలో కూడా ఇథనాల్ వినియోగం పెరుగుతోంది. గతంలో ఇథనాల్ తయారీకి చెరుకు ఎక్కువగా వినియోగించేవారు. కానీ ఇప్పుడు మక్కలు ఎక్కువగా వినియోగిస్తున్నారు. అంతేకాకుండా కోళ్లు, పశువుల దాణాగా కూడా మక్కల వినియోగం పెరిగింది.