మనమందరమూ భారతీయులమే : నిర్మలా సీతారామన్
వనవాసి, నగరవాసి, గ్రామవాసి ఎవరైనా మనం భారత వాసులమేనని కేంద్ర ఆర్థిక మంత్ర నిర్మలా సీతారామన్ అన్నారు. చారిత్రక సవాళ్ల మధ్య ఐక్యతను కాపాడుకోవడంలో భారత్ అసమాన సామర్థ్యాన్ని చూపిస్తోందన్నారు. భాగ్యనగరం వేదికగా శిల్పకళావేదికలో జరుగుతున్న లోక్ మంథన్ భాగ్యనగర్ 2024 ముగింపు కార్యక్రమంలో నిర్మలా సీతారామన్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఐరోపా, కెనడా, ఆస్ట్రేలియా, ఈజిప్టు దేశాల్లో స్థానికంగా వుండే తెగలు బాగా హింసకు గురయ్యారని, సమానత్వం కోసం పోరాడుతూనే వున్నారన్నారు. కానీ భారత్ లో మాత్రం ఇతిహాసాలు, పురాణాలు వనవాసి, గ్రామవాసి, నగరవాసి యొక్క ఏకత్వాన్ని జరుపుకుంటాయన్నారు.
ఈ అందర్నీ కలిపి వుంచే దృష్టే మన నాగరికతను చెక్కు చెదరకుండా చేసిందని వివరించారు. మనకు మార్గనిర్దేశనం చేసే ధర్మ సూత్రాల కారణంగా మన నాగరికత మనుగడ సాధించడమే కాకుండా అభివృద్ధి కూడా చెందిందన్నారు. వనవాసీల పట్ల వివక్ష వుందని అక్కడక్కడ మాట్లాడతారని, తమిళనాడులోని కొన్ని సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రాలను వనవాసీలు తమ దైవంగానే పూజిస్తారని తెలిపారు. జగద్గురు శంకరులు నాలుగు మూలలా నాలుగు పీఠాలు స్థాపించారని, తన బాల్యంలో కంచి పరమాచార్యుల బోధనలు విన్నానని నిర్మలా సీతారామన్ గుర్తు చేసుకున్నారు.
ఇక.. కేంద్ర పర్యాటక సాంస్కృతిక మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ మాట్లాడుతూ.. ఈ దేశాన్ని అనేక సంవత్సరాలుగా సాధు సంతులు రక్షిస్తూ వున్నరని, ధర్మ రక్షణలో వారి పాత్ర కీలకమన్నారు. అలాగే ఈ కాలంలో ధర్మ రక్షణ కోసం ఆరెస్సెస్ కూడా విశేషంగా కృషి చేస్తోందన్నారు. భారత చరిత్రను చూస్తే వేల సంవత్సరాల ఇతిహాసం, సాంస్కృతిక వైభవం కనిపిస్తుందన్నారు. ప్రపంచంలోనే అతిగొప్ప ఆధ్యాత్మిక కేంద్రం భారత్ అని అన్నారు. సనాతన ధర్మం కాపాడుకోవడానికి, కళలు, సంస్కృతులను కాపాడుకోవడానికి లోక్ మంథన్ లాంటి కార్యక్రమాలు బాగా ఉపయోగపడతాయన్నారు.