మన్యంవీరుడు అల్లూరి సీతారామరాజు
బ్రిటిష్ ప్రభుత్వంపై సాయుధపోరాటం చేసిన తెలుగువీరుడు అల్లూరి సీతా రామరాజు. 1897 జూలై 4న పశ్చిమగోదావరి జిల్లా భీమవరం తాలూకా మోగల్లు గ్రామంలో జన్మించాడు. తండ్రి వెంకట్రామరాజు, తల్లి నారాయణమ్మ.
దేశాన్ని అన్నివిధాలుగా దోచుకునేందుకు ప్రయత్నిస్తున్న బ్రిటిష్‌వారి కళ్ళు అడవి ప్రాంతాలపైన కూడా పడ్డాయి. తూర్పు గోదావరి జిల్లా మన్యం అడవులలో నివసించే గిరిజనులను బ్రిటిష్ అధికారులు హింసలకు గురిచేశారు. అటవీ ఉత్పత్తులను సేకరించి, విక్రయించే అధికారం అడవిపుత్రులకు లేదని ఆదేశాలు జారీచేయడమేకాక, నిబంధనల్ని కఠినంగా అమలు చేశారు. ‘పోడు’ వ్యవసాయం చేయడానికి వీళ్ళేదన్నారు. అప్పటి వరకూ గిరిజనులు అనుసరిస్తున్న స్థానిక కట్టుబాట్లు, నిబంధనల్ని తొలగించి నిరంకుశమైన చట్టాల్ని తెచ్చారు.
వీటిని వ్యతిరేకించినవారిని అమానుషంగా హింసించారు. బ్రిటిష్‌వారి దమననీతికి వ్యతిరేకంగా సీతారామరాజు గిరిజనులను కూడగట్టి సాయుధ పోరాటం చేశారు. 1922 ఆగస్ట్ 22న ప్రారంభమైన ఈ పోరాటం సీతారామరాజు పట్టుబడేవరకూ కొనసాగింది.చింతపల్లి, రాజకొమ్మంగి, అన్నవరం, చోడవరం పోలీస్‌స్టేషన్లపై దాడిచేసి ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ‘దాడి చేస్తున్నాను..చేతనైతే కాచుకోండి’ అని ముందుగా చెప్పిమరీ అల్లూరి దళం విరుచుకుపడేది.